స్వశక్తితో ఎదిగే మహిళల కోసం ‘మహిళా శక్తి’ | Interest free loan for SC and ST women to buy autos | Sakshi
Sakshi News home page

స్వశక్తితో ఎదిగే మహిళల కోసం ‘మహిళా శక్తి’

Published Sun, Nov 12 2023 4:08 AM | Last Updated on Sun, Nov 12 2023 4:08 AM

Interest free loan for SC and ST women to buy autos - Sakshi

సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత లక్ష్యంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వశక్తితో ఎదగాలనుకొనే పేదింటి మహిళలకు చేయూత­నిచ్చేందుకు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని, వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రైవింగ్‌ నైపుణ్యం ఉండీ పలువురు మహిళలు ఆటోలను కిరాయికి తీసుకొని నడుపుకొంటున్నారు. ఇకపై వారు అద్దెవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు  ‘మహిళా శక్తి’కి రూపకల్పన చేశారు. ఈ పథకంలో ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో పది శాతం లబ్ధిదారు అయిన మహిళ భరిస్తే సరిపోతుంది. మిగతా 90 శాతం సెర్ప్‌ ద్వారా ప్రభుత్వమే రుణంగా అందిస్తుంది. ఈ రుణానికి వడ్డీ ఉండదు.

మొత్తం రుణాన్ని 48 నెలలు కిస్తీ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తుంది. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి, వారికి డ్రైవింగ్‌లో నాలుగు రోజుల పాటు అదనపు శిక్షణ ఇచ్చారు.

ఆటోలకు వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్‌ సమయంలో భద్రత తదితర అంశాలపై శిక్షణ కూడ పూర్తి చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబరు 6వ తేదీన లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేస్తారు. మిగిలిన మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికీ అంబేడ్కర్‌ జయంతి రోజు ఏప్రిల్‌ 14న కొత్త ఆటోలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒక్కొక్కరికీ రూ.లక్షన్నర దాకా అదనపు ప్రయోజనం
సాధారణంగా ఆటోల కొనుగోలుకు బ్యాంకులు లేదా ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి. దీనిని నెలవారీ కిస్తీల రూపంలో తిరిగి చెల్లించాలి. వీటిపై కనీసం రూ. లక్షన్నర వడ్డీనే అవుతుంది. ఇది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారమే. మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందున, వారికి ఈ లక్షన్నర ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement