మహిళా రాజకీయ సాధికారతలో మనమే నంబర్ వన్
దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించిన సీఎం వైఎస్ జగన్
శాసనమండలి చరిత్రలో డిప్యూటీ చైర్‌పర్సన్‌గా తొలిసారి మైనార్టీ మహిళకు అవకాశం
కేబినెట్‌లో నలుగురికి అవకాశం.. హోం, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖల అప్పగింత
సర్పంచి, మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్.. మునిసిపల్ చైర్ పర్సన్, మేయర్ పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం
నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం
1,356 రాజకీయ నియామక పదవుల్లో 688 మహిళలకే
ఇలా మహిళలకు పదవుల కల్పన రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. ఆమెకు మెదడు ఉంది.. దానికి జ్ఞానం ఇవ్వాలి.. ఆమెకు హృదయం ఉంది.. దానికి అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి.
ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు?మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శ బాటసారి.
‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.
రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు.
అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. ప్రధానంగా మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. - సాక్షి, అమరావతి
కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా..
కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు.
♦ రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్‌పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు.
♦ 26 జెడ్పీ వై‹స్ చైర్‌పర్సన్‌లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు.
♦ 12 మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చారు.
♦ మొత్తం మునిసిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి.
♦ 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్‌పర్సన్లు.
♦ ఈ మునిసిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు.
♦ సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం ముదితలకే దక్కేలా చర్యలు తీసుకున్నారు.
♦ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం వనితలే ఉన్నారు.
చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు
♦ నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు.
♦ దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలి సారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు.
♦ మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 పదవులు ప్రమదాలోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చారు. అంటే మొత్తంగా 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment