సాక్షి, అమరావతి: సంతృప్తస్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నా రామోజీరావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడం ఆపడంలేదు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ ‘రైతు పథకాలకు కోత పెట్టడం.. విప్లవాత్మక పాలనా?’ అంటూ అబద్ధాలను అచ్చేసి ప్రభుత్వంపై సోమవారం తన ‘ఈనాడు’ పత్రికలో బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు కోతలంటే ఏమిటో మీ చంద్రబాబును అడిగితే.. రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కిన విధానాన్ని వివరిస్తాడు.
అలాగే రైతులకు సున్నావడ్డీలో పెట్టిన బకాయిల వివరాలు చెబుతాడు. అంతేగానీ అర్హతే కొలమానంగా పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ఆ రైతులే మీ పనిపడతారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తోంది ఈ ప్రభుత్వం. రైతులకు పథకాలను పంపిణీ చేసే ముందు అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీల్లో ప్రదర్శిస్తున్నారు.
అర్హత ఉండి జాబితాల్లో చోటుదక్కని వారికి మరో అవకాశం కల్పించడమే కాదు.. వారికి ఏటా రెండు విడతల్లో అదనంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చేస్తున్నారు. నిజంగా కోతలు పెట్టే ఉద్దేశం ఉంటే ఇలా బూతద్దం పెట్టి మరీ వెతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మాదిరిగా ఏదో సాకుతో కోతలు పెట్టొచ్చు.
ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు కన్పించలేదా?
వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 12,500 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి మిన్నగా ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పైగా దేశంలో మరెక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలురైతు కుటుంబాలతోపాటు అటవీ భూముల సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ.13,500 చొప్పున జమ చేస్తోంది.
ఇప్పటి వరకు 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ లెక్కన చూస్తే 2019–20తో పోలిస్తే 2023–24 నాటికి 6,83,530 మంది భూ యజమానులు అదనంగా లబ్ధిపొందారు. వీరిలో 5,88,811 మంది భూ యజమానులు ఉండగా, 51,418 మంది కౌలుదారులు, 43,301 మంది అటవీ భూసాగుదారులకు అదనంగా లబ్ధి చేకూరింది. నిజంగా కోత పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇలా ఏటా లక్షలాది మందికి అదనంగా లబ్ధి ఏ విధంగా కలిగిందో ‘ఈనాడు’కే తెలియాలి.
బీమాతో ధీమా ఇదీ..
రైతులపై పైసా భారం పడకుండా ఈ–క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫైడ్ పంటలన్నింటికీ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రక్షణ కల్పిస్తోంది ప్రభుత్వం. టీడీపీ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం ఇచ్చారు. ఖరీఫ్–21 సీజన్‌లో 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం జమ చేయగా, ఇదే సీజన్‌లో అర్హత ఉండి సాంకేతిక కారణాల వల్ల లబ్ధిపొందని 28,010 మంది రైతులను జల్లెడ పట్టి మరీ రూ. 187.18 కోట్ల మేర బీమా పరిహారం జమ చేశారు.
పారదర్శకంగా ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ
విపత్తులవేళ నష్ట పోయిన రైతులకు అత్యంత పారదర్శకంగా పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 22.85 లక్షల మంది రైతులకు రూ. 1,976.55 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. గతేడాది అర్హత ఉండి పరిహారం దక్కని 65,851 మందికి రూ. 63.25 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. రూ. లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద వడ్డీ రాయితీని వారి ఖాతాల్లోనే జమచేస్తోంది.
2014–18 మధ్య 39.07 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిల సొమ్మును జమ చేసింది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. అర్హత ఉండి రాయితీ పొందని 85,499 మందికి సామాజిక తనిఖీల్లో గుర్తించి, రూ. 18.32 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. నిజంగా కోత పెట్టే ఆలోచనే ఉంటే.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించేదా?.
రైతుల నిరంతర సేవలో ఆర్బీకేలు
విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రపంచ స్థాయి ఖ్యాతిని గడించాయి. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుసంవర్ధక, మత్స్యసహాయకులు సేవలందిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, పశుగ్రాసం, దాణా, ఆక్వా ఫీడ్, సీడ్‌లను రైతులకు సరఫరా చేస్తోంది. తక్కువ అద్దెకే సన్న, చిన్నకారు రైతులకు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
10,444 గ్రామ స్థాయి, 492 క్లస్టర్ స్థాయి యంత్రసేవ కేంద్రాల్లో యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి కోసం రూ.366.25 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించింది. ఇప్పటి వరకు 4.67 లక్షల మంది రైతులు 13.28 లక్షల ఎకరాలలో వ్యవసాయ పనులకు యంత్రాలను వినియోగించుకున్నారు. మరోవైపు ఆర్బీకే సేవలకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు అద్దెల చెల్లింపు కోసం ఇటీవల రూ.32.97 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు ‘ఈనాడు’ రోతరాతలు కొనసాగిస్తోంది.
పెట్టుబడి సాయం అందింది ఇలా..
2019–20లో 46,69,375 మందికి రూ. 6,173 కోట్లు,
2020–21లో 51,59,045 మందికి రూ. 6,928 కోట్లు,
2021–22లో 52,38,517 మందికి రూ. 7,016.59 కోట్లు,
2022–23లో 51,40,943 మందికి రూ. 6,944.50 కోట్లు,
2023–24లో రెండు విడతల్లో 53,52,905 మందికి రూ. 6,147.72 కోట్లు .
Comments
Please login to add a commentAdd a comment