సాక్షి, మహబూబాబాద్: గత ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్...వన్ రేషన్ అనే నినాదంతో ప్రజల ముగింటికి వచ్చారని, కానీ ప్రస్తుతం వన్ నేషన్.. వన్ దోస్త్‌గా వ్యవహరిస్తూ తన స్నేహితుడు అదానీకి రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రూ. 14.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే ధనాధన్‌గా అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన పీఎం మోదీ ఎవ్వరికీ రూపాయి వేయలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
ఇక్కడ ఏ మంత్రి అయినా మాట్లాడతారు..
తెలంగాణ అభివృద్ధిని వివరించేందుకు ఇక్కడ ఏ మంత్రి అయినా గంటల కొద్దీ చెబుతారని.. మీరు ఏం చెప్పగలరని కేటీఆర్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. నల్లధనం వెలికితీసి పేదలకు పంచుతామన్న ప్రధాని మోదీ... అదా నీ వంటి బడా కంపెనీలకు అప్పజెప్పిన డబ్బులతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.
గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా తననెవరూ అడిగే వారు లేరని విర్రవీగుతున్న ప్రధానికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించింది నిజం కాదా అని నిలదీశారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
మన ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకోవాలి
ప్రజలకు ఏం కావాలి.. ఏ పథకం అమలు చేస్తే ప్రజలు బాగుంటారని అనునిత్యం ఆలోచించే కేసీఆర్.. ఆయన నాయకత్వంలో పని చేస్తున్న మంత్రులంతా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రజల కోసం పాటుపడుతున్న నాయకులను, ప్రభుత్వాన్ని ప్రజ లు కడుపులో పెట్టుకుని చూసుకోవాలని కోరారు. ఒకప్పుడు నేను రానుబిడ్డో అని పాటలు పాడుకున్న సర్కారీ దవాఖానాలకు ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పారు.
నాడు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ పోతే వార్తగా మారిందన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకా ష్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, ఆరూరి రమే ష్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment