ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: గ తేడాది నవంబర్ నుంచి కమీషన్లు అందలేదని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. వివిధ శాఖలకు, ప్రజలకు వారధిగా ఉంటున్న మీ సేవ కేంద్రాల నిర్వహణ తడిసిమోపెడవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఏపీఎస్‌పీడీసీఎల్, రవాణ, స్టాక్ బుకింగ్, మున్సిపాలిటీ, ట్రాన్సక్షన్ తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శ్రీవెన్ ఏజెన్సీ కింద మీ సేవ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. శ్రీవెన్ ఏజెన్సీ వారు ఏడు నెలలుగా కమీషన్ ఇవ్వడంలేదన్నారు. దీంతో వీటి నిర్వహణ కష్టతరమైందని ఆవేదన చెందుతున్నారు. గది బాడుగ, విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులు భరించలేకున్నామన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కలిసినా వారు స్పందించడం లేదన్నారు. ఒక్కోసారి రీచార్జి చేసుకోవాలంటే రూ.50వేలు అవుతుందన్నారు.
పెట్టుబడి పెడితేనే లాభాలు వస్తాయని చెబుతున్నారేగానీ, కమీషన్లు ఇవ్వాలన్న ఆలోచన వారికి లేనట్లుందని నిర్వాహకులు అంటున్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో రీచార్జి చేసుకున్నందుకు చార్జీల పేరుతో రు.2,500లకుపైగా వసూలు చేశారని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం కల్పించిన భృతికి ఏజెన్సీవారు గండికొడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మీ సేవ కేంద్రానికి ఇప్పటి వరకు రు.70వేల నుంచి లక్ష వరకు కమీషన్లు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మార్చిలో శ్రీవెన్ ఏజెన్సీవారు మీ సేవ సాఫ్ట్‌వేర్‌ను మార్చారన్నారు. దీంతో అప్పటివరకు జరిగిన లావాదేవీలు, వాటి వివరాలు, కమీషన్ ఎంత అనే విషయాలు కనిపించడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తమకు కమీషన్లు ఇప్పించాలని వారు కోరుతున్నారు.
వారంలోపు కమీషన్లు చెల్లిస్తాం..
2013 నవంబర్ నుంచి మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్లు రాలేదని, మరో వారంలోపు చెల్లిస్తామని శ్రీవెన్ ఏజెన్సీ మీ సేవ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజు ‘న్యూస్‌లైన్’కు వివరణ ఇచ్చారు.
కమీషన్లకు నోచుకోని మీ సేవ కేంద్రాలు
Published Sat, May 24 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement