poduturu town
-
ఏమవుతుందో..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఆమ్వే సీఈఓ అరెస్టుతో జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్న ఏజెంట్లు ఉలిక్కి పడ్డారు. ఎక్కడ తమ పేర్లు బయట పడి అరెస్టు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు ఆమ్వే సీఈఓ విలియంను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విలియంను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో జిల్లాలోని ఆమ్వే ఏజెంట్లలో ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంలో ఆమ్వే కార్యాలయం ఉండటం, తిరుపతిలో ఆమ్వే స్టోర్ రూమ్ ఉండటంతో వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారితోపాటు పోలీసు శాఖలోని చాలా మంది సిబ్బంది ఆమ్వేలో చేరారు. తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఆమ్వే ఏజెంట్లు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి గోల్డ్, సిల్వర్ స్టేజీలలో ఉన్న ఏజెంట్లు వస్తుంటారు. ఆమ్వేలో చేరడంతోపాటు మరికొందరిని చేర్పిస్తే కమీషన్ల రూపంలో డబ్బులు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చాలా మంది నిరుద్యోగులు ఇందులో చేరారు. మొదట్లో రూ.5వేలు చెల్లించి మరో ముగ్గురిని చేర్పిస్తే కొంత కమీషన్ రూపంలో వచ్చేది. దీని తర్వాత ఆమ్వే ప్రొడక్ట్స్ ఇన్ని పాయింట్లకు కొనుగోలు చేయాలన్న నిబంధన కూడా ఉండేది. ఈ విధంగా చేస్తూ పోతే సిల్వర్, గోల్డ్, ప్లాటినం తదితర స్టేజిలు మారుతూ పోతే నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు సంబంధిత స్టేజీలలో ఉన్న ఏజెంట్ల అకౌంట్లలో జమ అయ్యేవి. ఈ విధంగా జిల్లాలో వందలాది మంది ఆమ్వేలో ఏజెంట్లుగా మారారు. వీరికి ఆమ్వే బిజినెస్ ఓనర్ కార్డులు కూడా ఆమ్వే సంస్థ నుంచి ఏజెంట్లకు అందాయి. ఈ కార్డులను తీసుకెళితే ఆమ్వే స్టోర్ రూమ్‌లలో వారి ఏడీఏ నెంబర్ ఆధారంగా డిస్కౌంట్ అందిస్తారు. ఈ విధంగా చేరిన వారిలో చాలా మంది ప్రతి నెల ఆమ్వే ప్రొడక్ట్స్ తీసుకుని అమ్ముకోలేక మధ్యలోనే వదలి డబ్బులు పోగొట్టుకున్నారు. ఎస్పీ హెచ్చరించినా కొనసాగుతున్న వ్యాపారం ఆమ్వేలో చేరవద్దని చైన్లింకింగ్ స్కీంలపై కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్వయంగా ప్రకటించినా జిల్లాలో వ్యాపారం కొనసాగుతోంది. ఈ వ్యాపారం చేస్తున్నవారిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారి సతీమణులే ఎక్కువగా ఉన్నారు. అన్ని శాఖల్లో కూడా ఆమ్వే ఏజెంట్లు కుప్పలుతెప్పలుగా ఉన్నారు. వీరందరూ ఇప్పుడు వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్నారు. -
కమీషన్లకు నోచుకోని మీ సేవ కేంద్రాలు
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: గ తేడాది నవంబర్ నుంచి కమీషన్లు అందలేదని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. వివిధ శాఖలకు, ప్రజలకు వారధిగా ఉంటున్న మీ సేవ కేంద్రాల నిర్వహణ తడిసిమోపెడవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఏపీఎస్పీడీసీఎల్, రవాణ, స్టాక్ బుకింగ్, మున్సిపాలిటీ, ట్రాన్సక్షన్ తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శ్రీవెన్ ఏజెన్సీ కింద మీ సేవ కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. శ్రీవెన్ ఏజెన్సీ వారు ఏడు నెలలుగా కమీషన్ ఇవ్వడంలేదన్నారు. దీంతో వీటి నిర్వహణ కష్టతరమైందని ఆవేదన చెందుతున్నారు. గది బాడుగ, విద్యుత్ బిల్లు, ఇతర ఖర్చులు భరించలేకున్నామన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను కలిసినా వారు స్పందించడం లేదన్నారు. ఒక్కోసారి రీచార్జి చేసుకోవాలంటే రూ.50వేలు అవుతుందన్నారు. పెట్టుబడి పెడితేనే లాభాలు వస్తాయని చెబుతున్నారేగానీ, కమీషన్లు ఇవ్వాలన్న ఆలోచన వారికి లేనట్లుందని నిర్వాహకులు అంటున్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో రీచార్జి చేసుకున్నందుకు చార్జీల పేరుతో రు.2,500లకుపైగా వసూలు చేశారని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రభుత్వం కల్పించిన భృతికి ఏజెన్సీవారు గండికొడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మీ సేవ కేంద్రానికి ఇప్పటి వరకు రు.70వేల నుంచి లక్ష వరకు కమీషన్లు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మార్చిలో శ్రీవెన్ ఏజెన్సీవారు మీ సేవ సాఫ్ట్‌వేర్‌ను మార్చారన్నారు. దీంతో అప్పటివరకు జరిగిన లావాదేవీలు, వాటి వివరాలు, కమీషన్ ఎంత అనే విషయాలు కనిపించడంలేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తమకు కమీషన్లు ఇప్పించాలని వారు కోరుతున్నారు. వారంలోపు కమీషన్లు చెల్లిస్తాం.. 2013 నవంబర్ నుంచి మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు కమీషన్లు రాలేదని, మరో వారంలోపు చెల్లిస్తామని శ్రీవెన్ ఏజెన్సీ మీ సేవ కేంద్రాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రాజు ‘న్యూస్‌లైన్’కు వివరణ ఇచ్చారు. -
నిలువు దోపిడీ
‘సార్.. గ్యాస్.. ఆ.. వస్తున్నా.. ఇదిగో సార్ బిల్లు.. ఇదిగో బాబూ డబ్బు.. ఇంకో 40 రూపాయలివ్వండి సార్.. అదేంటయ్యా.. బిల్లు 408 రూపాయలే కదా.. 450 ఇవ్వమంటున్నావ్.. అదేంది సార్.. కొత్తగా మాట్లాడుతున్నారు.. ఇది ‘మామూలే’ సార్’.. ఇది ప్రతిరోజూ గ్యాస్బాయ్కు.. వినియోగదారుడికి మధ్య జరిగే సంభాషణ. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్‌బాయ్ సిలిండర్ ఇంటికి తెచ్చాక బిల్లుకంటే అదనంగా డబ్బు ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే సిలిండర్ ఇవ్వకుండా వెనక్కు తీసుకెళ్తారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దోపిడీకి తెగబడ్డారు. సిలిండర్ ధర రూ.408 ఉండగా అదనంగా ఏజన్సీల వారు రూ.2 వసూలు చేస్తుండగా ఇంటి వద్దకు సిలిండ ర్ తీసుకొచ్చిన బాయ్‌లు రూ.450 వసూలు చేస్తున్నారు. ప్రొద్దుటూరులో అయితే 25 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తుంటే, కడపలో మరీ దారుణంగా సిలిండర్‌పై రూ. 40 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని అనిల్గ్యాస్ ఏజన్సీ పరిధిలో 20,114 మంది వినియోగదారులు, బాలాజీ గ్యాస్ ఏజన్సీ పరిధిలో 49,406 మంది, ఈశ్వర్ఇండేన్ గ్యాస్ ఏజన్సీ పరిధిలో 35,002 మంది వినియోగదారులు ఉన్నారు. ఈ ఏజెన్సీల పరిధిలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, దువ్వూరు, ఎర్రగుంట్ల, రాజుపాళెం గ్రామాల్లోని లబ్ధిదారులే కాకుండా పులివెందుల మండలంలోని పలు గ్రామాల వినియోగదారులు కూడా ఉన్నారు. వీరిలో దాదాపు 70 శాతానికి పైగా డోర్ డెలివరీ వినియోగదారులే ఉన్నారు. ఈ విధంగా ఒక్కో నెలకు గ్యాస్ సిలిండర్లపై అదనంగా వసూలు చేసే మొత్తం రూ.లక్షల్లోనే ఉంది. ఇంత దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. గ్యాస్ ఏజెన్సీల దోపిడీ గురించి ఎవరైనా వినియోగదారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా తనిఖీ చేసి, హెచ్చరికలు జారీ చేయడంతో తమ పని అయిపోయిందనిపించుకుంటున్నారు. బాయ్‌లకు జీతాలు చెల్లిస్తున్నారా...? గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ చేసే బాయ్‌లకు జీతాలు చెల్లిస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే ఒక్కో వినియోగదారుని నుంచి వసూలు చేసే డబ్బుతో ఒక్కో బాయ్‌కి వేలాది రూపాయలు ప్రతి నెలా మిగులుతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక వేళ బాయ్‌లకు ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంటే వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్న బాయ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ దోపిడీ వెనుక గ్యాస్ ఏజె న్సీ నిర్వాహకులు, గ్యాస్బాయ్లు ఇద్దరి ప్రమేయం ఉన్నట్లయితే అధికారులేం చేస్తున్నారనే విషయం తేలాలి. ఒక్క ప్రొద్దుటూరు పట్టణంలోని మూడు ఏజెన్సీలకు సంబంధించి ఉన్న లక్ష గ్యాస్కనెక్షన్లలో 75 శాతం డోర్ డెలెవరి లెక్కకడితే వసూలు చేసే డబ్బు దాదాపు రూ.20లక్షలుగా తేలుతోంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజల నుంచి గ్యాస్ ఏజెన్సీలు రాబడుతున్నాయని స్పష్టమవుతోంది. రెవెన్యూ అధికారులకు తెలియదా..? ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ వినియోగదారుల నుంచి డబ్బును గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేస్తున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలియదా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో రెవెన్యూ అధికారులకు సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జాయింట్ కలెక్టర్ నిర్మల స్వయంగా వచ్చి గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి ప్రజల బాధలను తెలుసుకున్నా ఫలితం శూన్యం. తహశీల్దార్ ఏమంటున్నారంటే గ్యాస్ బాయ్‌లు చేస్తున్న దోపిడీపై ప్రొద్దుటూరు తహశీల్దార్ పుల్లారెడ్డి మాట్లాడుతూ డెలివరీ బాయ్‌లు అంతడబ్బు వసూలు చేయకూడదు. విచారణ చేస్తాం. అన్నారు.