ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఆమ్వే సీఈఓ అరెస్టుతో జిల్లాలో కుప్పలు తెప్పలుగా ఉన్న ఏజెంట్లు ఉలిక్కి పడ్డారు. ఎక్కడ తమ పేర్లు బయట పడి అరెస్టు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు ఆమ్వే సీఈఓ విలియంను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విలియంను కడప కేంద్ర కారాగారానికి తరలించారు. దీంతో జిల్లాలోని ఆమ్వే ఏజెంట్లలో ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంలో ఆమ్వే కార్యాలయం ఉండటం, తిరుపతిలో ఆమ్వే స్టోర్ రూమ్ ఉండటంతో వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారితోపాటు పోలీసు శాఖలోని చాలా మంది సిబ్బంది ఆమ్వేలో చేరారు. తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఆమ్వే ఏజెంట్లు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు తిరుపతి, అనంతపురం
తదితర ప్రాంతాల నుంచి గోల్డ్, సిల్వర్ స్టేజీలలో ఉన్న ఏజెంట్లు వస్తుంటారు. ఆమ్వేలో చేరడంతోపాటు మరికొందరిని చేర్పిస్తే కమీషన్ల రూపంలో డబ్బులు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చాలా మంది నిరుద్యోగులు ఇందులో చేరారు.
మొదట్లో రూ.5వేలు చెల్లించి మరో ముగ్గురిని చేర్పిస్తే కొంత కమీషన్ రూపంలో వచ్చేది. దీని తర్వాత ఆమ్వే ప్రొడక్ట్స్ ఇన్ని పాయింట్లకు కొనుగోలు చేయాలన్న నిబంధన కూడా ఉండేది. ఈ విధంగా చేస్తూ పోతే సిల్వర్, గోల్డ్, ప్లాటినం తదితర స్టేజిలు మారుతూ పోతే నెలకు రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు సంబంధిత స్టేజీలలో ఉన్న ఏజెంట్ల అకౌంట్లలో జమ అయ్యేవి. ఈ విధంగా జిల్లాలో వందలాది మంది ఆమ్వేలో ఏజెంట్లుగా మారారు. వీరికి ఆమ్వే బిజినెస్ ఓనర్ కార్డులు కూడా ఆమ్వే సంస్థ నుంచి ఏజెంట్లకు అందాయి. ఈ కార్డులను తీసుకెళితే ఆమ్వే స్టోర్ రూమ్‌లలో వారి ఏడీఏ నెంబర్ ఆధారంగా డిస్కౌంట్ అందిస్తారు. ఈ విధంగా చేరిన వారిలో చాలా మంది ప్రతి నెల ఆమ్వే ప్రొడక్ట్స్ తీసుకుని అమ్ముకోలేక మధ్యలోనే వదలి డబ్బులు పోగొట్టుకున్నారు.
ఎస్పీ హెచ్చరించినా కొనసాగుతున్న వ్యాపారం
ఆమ్వేలో చేరవద్దని చైన్‌లింకింగ్ స్కీంలపై కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్వయంగా ప్రకటించినా జిల్లాలో వ్యాపారం కొనసాగుతోంది. ఈ వ్యాపారం చేస్తున్నవారిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారి సతీమణులే ఎక్కువగా ఉన్నారు. అన్ని శాఖల్లో కూడా ఆమ్వే ఏజెంట్లు కుప్పలుతెప్పలుగా ఉన్నారు. వీరందరూ ఇప్పుడు వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్నారు.
ఏమవుతుందో..!
Published Fri, May 30 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement