నిలువు దోపిడీ | Gas cylinder saleing double price in YSR district | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ

Published Thu, Nov 21 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

Gas cylinder saleing  double price in YSR district

‘సార్.. గ్యాస్.. ఆ.. వస్తున్నా.. ఇదిగో సార్ బిల్లు.. ఇదిగో బాబూ డబ్బు..  ఇంకో 40 రూపాయలివ్వండి సార్.. అదేంటయ్యా.. బిల్లు 408 రూపాయలే కదా.. 450 ఇవ్వమంటున్నావ్.. అదేంది సార్.. కొత్తగా మాట్లాడుతున్నారు.. ఇది ‘మామూలే’ సార్’.. ఇది ప్రతిరోజూ గ్యాస్‌బాయ్‌కు.. వినియోగదారుడికి మధ్య జరిగే సంభాషణ. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్‌బాయ్ సిలిండర్ ఇంటికి తెచ్చాక బిల్లుకంటే అదనంగా డబ్బు ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే  సిలిండర్ ఇవ్వకుండా వెనక్కు తీసుకెళ్తారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
 
 ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్:  జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దోపిడీకి తెగబడ్డారు. సిలిండర్ ధర రూ.408 ఉండగా అదనంగా ఏజన్సీల వారు రూ.2 వసూలు చేస్తుండగా ఇంటి వద్దకు సిలిండ ర్ తీసుకొచ్చిన బాయ్‌లు రూ.450  వసూలు చేస్తున్నారు.
 
 ప్రొద్దుటూరులో అయితే 25 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తుంటే, కడపలో మరీ దారుణంగా సిలిండర్‌పై రూ. 40 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని అనిల్‌గ్యాస్ ఏజన్సీ పరిధిలో 20,114 మంది వినియోగదారులు, బాలాజీ గ్యాస్ ఏజన్సీ పరిధిలో 49,406 మంది, ఈశ్వర్‌ఇండేన్ గ్యాస్ ఏజన్సీ పరిధిలో 35,002 మంది వినియోగదారులు ఉన్నారు. ఈ ఏజెన్సీల పరిధిలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, దువ్వూరు, ఎర్రగుంట్ల, రాజుపాళెం గ్రామాల్లోని లబ్ధిదారులే కాకుండా పులివెందుల మండలంలోని పలు గ్రామాల వినియోగదారులు కూడా ఉన్నారు. వీరిలో దాదాపు 70 శాతానికి పైగా డోర్ డెలివరీ వినియోగదారులే ఉన్నారు. ఈ విధంగా ఒక్కో నెలకు గ్యాస్ సిలిండర్లపై అదనంగా వసూలు చేసే మొత్తం రూ.లక్షల్లోనే ఉంది. ఇంత దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. గ్యాస్ ఏజెన్సీల దోపిడీ  గురించి ఎవరైనా వినియోగదారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా తనిఖీ చేసి, హెచ్చరికలు జారీ చేయడంతో తమ పని అయిపోయిందనిపించుకుంటున్నారు.
 
 బాయ్‌లకు జీతాలు చెల్లిస్తున్నారా...?
 గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ చేసే బాయ్‌లకు జీతాలు చెల్లిస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే ఒక్కో వినియోగదారుని నుంచి వసూలు చేసే డబ్బుతో ఒక్కో బాయ్‌కి వేలాది రూపాయలు ప్రతి నెలా మిగులుతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక వేళ బాయ్‌లకు ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంటే వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్న బాయ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విషయం తెలియాల్సి ఉంది.
 
 ఒకవేళ ఈ దోపిడీ వెనుక గ్యాస్ ఏజె న్సీ నిర్వాహకులు, గ్యాస్‌బాయ్‌లు ఇద్దరి ప్రమేయం ఉన్నట్లయితే అధికారులేం చేస్తున్నారనే  విషయం తేలాలి. ఒక్క ప్రొద్దుటూరు పట్టణంలోని మూడు ఏజెన్సీలకు సంబంధించి ఉన్న లక్ష గ్యాస్‌కనెక్షన్లలో 75 శాతం డోర్ డెలెవరి లెక్కకడితే వసూలు చేసే డబ్బు దాదాపు రూ.20లక్షలుగా తేలుతోంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజల నుంచి గ్యాస్ ఏజెన్సీలు రాబడుతున్నాయని స్పష్టమవుతోంది.
 
 రెవెన్యూ అధికారులకు తెలియదా..?
 ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ వినియోగదారుల నుంచి డబ్బును గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేస్తున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలియదా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో రెవెన్యూ అధికారులకు సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జాయింట్ కలెక్టర్ నిర్మల స్వయంగా వచ్చి గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి ప్రజల బాధలను తెలుసుకున్నా ఫలితం శూన్యం.
 
 తహశీల్దార్ ఏమంటున్నారంటే
 గ్యాస్ బాయ్‌లు చేస్తున్న దోపిడీపై ప్రొద్దుటూరు తహశీల్దార్ పుల్లారెడ్డి మాట్లాడుతూ డెలివరీ బాయ్‌లు అంతడబ్బు వసూలు చేయకూడదు. విచారణ చేస్తాం. అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement