సాక్షి, అమరావతి: కొద్దిసేపు కరెంట్ లేకపోతే లోకమంతా చీకటైపోయినట్టుగా ఉంటుంది. కరెంట్ రాగానే హమ్మయ్య అనుకుంటాం. మన దైనందిక జీవితంలో చీకటి వెలుగులు నింపే విద్యుత్ రంగంలో కూడా ఈ ఏడాది అలాంటి పరిస్థితులే ఉన్నాయి. బొగ్గు సంక్షోభంలో అధిక ధరలకు బయట మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడటం దగ్గర్నుంచి, డిస్కంల చరిత్రలోనే తొలిసారి ట్రూడౌన్ చార్జీల పేరుతో వినియోగదారులకు తిరిగి డబ్బులివ్వడం వరకు ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ‘సెకి’తో ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో రూ.కోట్లలో విద్యుత్ ఆదా అయింది. ఇలా విద్యుత్ రంగంలో ఈ ఏడాది చోటుచేసుకున్న అనేక పరిణామాల్లో ముఖ్యమైనవి కొన్ని..
అంతర్జాతీయ పరిస్థితులు, వర్షాలు, కోవిడ్ సెకండ్‌వేవ్ తదనంతర పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా మన రాష్ట్రంలో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడ లేదు. అయితే బొగ్గు కొరత కారణంగా మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు ధరలు పెరిగాయి. సాధారణంగా రూ.4 నుంచి రూ.5కు వచ్చే యూనిట్‌కు దాదాపు రూ.6 నుంచి పీక్ అవర్స్‌లో రూ.20 వరకు వెచ్చించాల్సి వచ్చింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఫలితంగా రాష్ట్రానికి బొగ్గు సరఫరా మెరుగైంది. బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్ల అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఉచిత విద్యుత్ పథకంతో రానున్న 30 ఏళ్ల పాటు రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన సోలార్ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఈసీఐ–సెకి) ప్రతిపాదించింది. 25 ఏళ్లపాటు యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడువేల మెగావాట్ల సౌర విద్యుత్తును కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బహిరంగ మార్కెట్లో చౌక విద్యుత్ కొనుగోలు, ఇతర ఉత్తమ ప్రమాణాల అమలు ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాదాపు రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగాయి. పరిశ్రమలు, స్థానిక సంస్థలు, వ్యవసాయం, భవనాల్లో విద్యుత్ పొదుపు చర్యల కారణంగా గడిచిన ఏడాదిలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధనం ఆదా అయింది.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో 20 శాతం పెరిగింది.
కేంద్రప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ప్రారంభించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ (ఈఈ) ప్రాజెక్టుల గ్రేడింగ్‌లో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీకి స్థానం దక్కింది.
భారీ వరదల కారణంగా చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో విద్యుత్ శాఖకు సుమారు రూ.19.13 కోట్ల నష్టం వాటిల్లింది. గులాబ్ తుఫాన్ వల్ల తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.7.87 కోట్ల నష్టం సంభవించింది.
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల 21 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నెగెటివ్ ఫ్యూయెల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ (ఎఫ్‌పీపీసీఏ)కు దరఖాస్తు చేశాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న ఇంధన పొదుపు చర్యలు, సంస్కరణల కారణంగా డిస్కంలు తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి ఖర్చులు మిగుల్చుతున్నాయి. అలా మిగిలిన మొత్తాన్నీ వినియోగదారులకే ఇవ్వాలని భావిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు దాదాపు రూ.126.16 కోట్లు తిరిగి రానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న 28.30 లక్షల ఇళ్లకు అత్యంత నాణ్యమైన విద్యుత్తును అందించడానికి రూ.7,080 కోట్లు వెచ్చించేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధమయ్యాయి. కాలనీల్లో ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్ విద్యుదీకరణ పనులు చేపట్టాయి.
2014–15 నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతి ఇచ్చింది.
ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసి సెప్టెంబర్, అక్టోబర్ నెల బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు విధించాయి. కానీ న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్‌సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌లో రూ.70 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) రూ.28 లక్షలను (మొత్తం రూ.196.28 కోట్లను) వినియోగదారులకు వెనక్కి ఇస్తూ, విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment