సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్‌లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఎండల తీవ్రతతో..
రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది.
సగం తగ్గించుకుంటే..
గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది.
పవర్ హాలిడే ఇలా
► ఏపీఎస్పీడీసీఎల్‌లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్‌లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్‌లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు.
► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్‌లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్‌లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు.
► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment