Household electrical
-
సాగు, ఇళ్లకు ఫుల్ ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరెంట్ కష్టాలు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రోజూ దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టింది. ఇక పరిశ్రమలు మాత్రం ఇంధన శాఖ విధించిన ఆంక్షలను మరికొన్నాళ్లు పాటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వతేదీ వరకు పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసుల విద్యుత్ వినియోగంపై పరిమితులను పొడిగించేందుకు డిస్కమ్‌లు చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించింది. డిస్కమ్‌లు ఏప్రిల్ 8వతేదీ నుంచి ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎండల తీవ్రతతో.. రాష్ట్రంలో తాజాగా రోజూ 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మే నెల మొదటి వారానికి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గి కొంతమేర కరెంట్ అందుబాటులోకి వస్తుందని భావించినా ఎండల కారణంగా ఏమాత్రం వినియోగం తగ్గలేదు. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ రూ.11.60 చొప్పున చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్తు కొనుగోలు కోసం రోజూ రూ.37.73 కోట్లు ఖర్చు చేస్తోంది. సగం తగ్గించుకుంటే.. గృహ, వ్యవసాయ సర్వీసులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలపై ఆంక్షలు కొనసాగించాల్సి వస్తోందని ఇంధనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ప్రతి రోజూ 50 శాతం మాత్రమే వినియోగించాలని, మిగతా పరిశ్రమలు వారంలో ఒకరోజు పవర్ హాలిడే పాటించాలని నిబంధనలు విధించారు. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా విద్యుత్తు వాడకాన్ని 50 శాతం మేర తగ్గించుకోవాలని, ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్వాహకులు, సంఘాల అభ్యర్థన మేరకు కొన్నిటికి మినహాయింపులు, చార్జీల నుంచి వెసులుబాటును ఏపీఈఆర్సీ కల్పించింది. పవర్ హాలిడే ఇలా ► ఏపీఎస్పీడీసీఎల్లో పరిధిలోని తిరుపతిలో శుక్రవారం, హిందుపురం డివిజన్లో శనివారం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సోమవారం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లు మినహా మిగిలిన అన్ని డివిజన్లలో మంగళవారం, నెల్లూరు గ్రామీణ, గూడూరు డివిజన్లలో బుధవారం, పుత్తూరు డివిజన్లో గురువారం పరిశ్రమలకు పవర్ హాలిడే అమలు చేస్తున్నట్టు సీఎండీ హెచ్.హరనాధరావు తెలిపారు. ► ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖ జోన్–11 డివిజన్లో శుక్రవారం, జోన్–1, జోన్–3, నర్సీపట్నం, పాడేరు, కశింకోట డివిజన్లలో శనివారం, శ్రీకాకుళం జిల్లాలో సోమవారం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి డివిజన్లో బుధవారం, అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలి డివిజన్లలో గురువారం పవర్ హాలిడే ప్రకటించినట్లు సీఎండీ కె.సంతోషరావు వెల్లడించారు. ► ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని గుంటూరులో శుక్రవారం, విజయవాడలోని గుణదల, మాచర్ల, కందుకూరులో శనివారం, విజయవాడ గ్రామీణ, గుంటూరు–1 టౌన్, మార్కాపురం, చీరాలలో సోమవారం, మచిలీపట్నం, బాపట్ల, అద్దంకిలో మంగళవారం, విజయవాడ, ఉయ్యూరు, నూజివీడు, తెనాలి, ఒంగోలు, అమరావతిలో బుధవారం, గుడివాడ, నరసరావుపేట, దర్శిలో గురువారం పవర్ హాలిడే విధిస్తున్నామని సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
గృహ విద్యుత్తుకు రూ. 1,707 కోట్ల సబ్సిడీ
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.10,060.63 కోట్ల సబ్సిడీ ఇస్తుండగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగదారులకు అత్యధికంగా రూ.1,707.07 కోట్లు అందచేస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి యూనిట్‌కు రూ.1.46 చొప్పున ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఇంధనశాఖ గణాంక విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. వెంటాడుతున్న గతం ► 2015లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.24,969. 09 కోట్లు కాగా 2019 మార్చి నాటికి ఇది రూ.48110. 79 కోట్లకు చేరింది. టీడీ పీ హయాంలో ఐదేళ్లలోనే వ్యయం రూ.23,141. 07 కోట్లు పెరిగింది. మార్కెట్లో చౌకగా విద్యు త్ లభిస్తున్నా అత్యధిక రేట్లతో ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లకే గత ప్రభుత్వం ఆసక్తి చూపడంతో వ్యయం రెట్టింపైంది. ► నిర్వహణ వ్యయం పెరిగిన కొద్దీ విద్యుత్ టారిఫ్ పెరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని నియంత్రణ మండలికి స్పష్టం చేయకుండా ఐదేళ్ల తర్వాత (2019 జనవరిలో) ట్రూ–ఆప్ పేరుతో రూ.19,604 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు కమిషన్ అనుమతి కోరింది. నిజానికి ఏటా వాస్తవ లెక్కలు కమిషన్‌కు వెల్లడిస్తే నిర్వహణ వ్యయం మరింత పెరిగి ఉండేది. ► ఈ భారమంతా ప్రజలపై పడకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు భారీగా సబ్సిడీ ఇచ్చింది. 2015లో ప్రతి యూనిట్‌కు కేవలం 59 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా ప్రస్తుతం రూ.1.46 చొప్పున ఇవ్వడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ► 2019లో విద్యుత్ ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు రూ.8.82 ఉండగా దుబారాను అరికట్టడంతో ఈ ఏడాది రూ.7.75కి తగ్గింది. దీంతో పాటు ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రూ.1.46 చొప్పున సబ్సిడీ ఇస్తోంది. ఆర్థిక క్రమశిక్షణతో.. ► వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యుత్ శాఖ ఆర్థిక క్రమ శిక్షణ దిశగా అడుగులేస్తోంది. ప్రజల పై విద్యుత్ భారం పడకుండా తొలుత నిర్వహణ వ్యయాన్ని అదుపు లోకి తెచ్చింది. ఇందుకోసం చౌక విద్యుత్ కొనుగోళ్లనే ఎంపిక చేసుకుంది. ► 2019లో గత సర్కారు వైదొలగేనాటికి విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.48,110.79 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం రూ.43,327.56 కోట్లకు తగ్గించారు. అంటే దాదాపు 4,783.23 కోట్ల మేర అనవసర వృథాను అరికట్టారు. -
‘ఉచితం’ ఉత్తిదేనా!
యాచారం, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగిస్తే ఉచితం అనే మాట ఉత్తుత్తి ప్రచారంగానే మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రచారార్భాటమే తప్ప ఆచరణలో అమలుకు నోచుకోకపోవడంతో పేదలకు ఏ మాత్రం ప్రయోజన కలగడం లేదు. దీంతో పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నా.. బిల్లులు మాత్రం నెలవారీగా చెల్లిస్తూనే ఉన్నారు. అసలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే బిల్లులు ఉండవని కూడా లబ్ధిదారులకు అవగాహన లేకుండాపోయింది. ప్రభుత్వం గొప్పలకు ప్రచారం చేసుకుంటూ అమలులో మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు శాపంగా మారింది. ఇందిరమ్మ కలల పథకం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బడ్జెట్ కింద ఎస్సీ, ఎస్టీల గృహ వినియోగానికి సంబంధించి పాత బకాయిలు మాఫీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది మార్చి నుంచి పేదలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే ఉప ప్రణాళిక ద్వారా బకాయిలు చెల్లించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మండలంలో ఏడు వేలకుపైగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలు ఉండగా.. గత నెల క్రితం నిర్వహించిన రచ్చబండ-3లో మాత్రం కేవలం 1,047 మందికే ఉచిత విద్యుత్ వర్తించేలా ఎంపిక చేశారు. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తే మాత్రం బిల్లులు చెల్లించనవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. అర్హులైనవారు కేవలం కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తే సరిపోతుందని తెలియజేశారు. చిత్తశుద్ధిలో లోపం.. అమలులో జాప్యం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడితే బిల్లులుండవని అధికారులు రచ్చ బండ-3లో చెప్పిన మాటలతో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో సంతోషపడ్డారు. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లోపం కారణంగా అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలోని 20 గ్రామాల్లో నెలకు 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఏడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎస్టీ కుటుంబాలున్నాయి. చింతపట్ల, నక్కర్తమేడిపల్లి, యాచారం, చౌదర్పల్లి, మొండిగౌరెల్లి, చింతుల్ల, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ఎస్సీలు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పేదలు నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అధిక బిల్లులు రావడంతో చాలామంది ఎస్సీ, ఎస్టీల బకాయి బిల్లులు రూ. 50 లక్షలకు చేరాయి. అంధకారంలో ఉండలేక కొంతమంది పేదలు మాత్రం నెలవారీగా బిల్లులు చెల్లిస్తున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా పలువురు బిల్లులు చెల్లించడంలో జాప్యంతో వేలాది రూపాయల బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి. విద్యుత్ అధికారులు సైతం అర్హులైన పేదలను ఎంపిక చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రచ్చబండ-3 తర్వాత మండలంలో పలు గ్రామాల్లో బిల్లులు తీసే సమయంలో విద్యుత్ సిబ్బంది 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు కుల ధ్రువీకరణపత్రాలు ఇస్తే సరిపోతుంది. ఇక నుంచి బిల్లులు చెల్లించేది ఉండదు. కానీ 50 యూనిట్ల లోపు మాత్రమే విద్యుత్ వాడుకోవాలి అని అధికారులు గతంలో సూచించారు. అమలులో మాత్రం విఫలమతున్నారు. దీంతో అర్హులైన పేదలు బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు. కొన్నిచోట్ల బకాయిలు అలాగే ఉంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.