సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.10,060.63 కోట్ల సబ్సిడీ ఇస్తుండగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగదారులకు అత్యధికంగా రూ.1,707.07 కోట్లు అందచేస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి యూనిట్‌కు రూ.1.46 చొప్పున ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఇంధనశాఖ గణాంక విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది.
వెంటాడుతున్న గతం
► 2015లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.24,969. 09 కోట్లు కాగా 2019 మార్చి నాటికి ఇది రూ.48110. 79 కోట్లకు చేరింది. టీడీ పీ హయాంలో ఐదేళ్లలోనే వ్యయం రూ.23,141. 07 కోట్లు పెరిగింది. మార్కెట్లో చౌకగా విద్యు త్ లభిస్తున్నా అత్యధిక రేట్లతో ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లకే గత ప్రభుత్వం ఆసక్తి చూపడంతో వ్యయం రెట్టింపైంది.
► నిర్వహణ వ్యయం పెరిగిన కొద్దీ విద్యుత్ టారిఫ్ పెరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని నియంత్రణ మండలికి స్పష్టం చేయకుండా ఐదేళ్ల తర్వాత (2019 జనవరిలో) ట్రూ–ఆప్ పేరుతో రూ.19,604 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు కమిషన్ అనుమతి కోరింది. నిజానికి ఏటా వాస్తవ లెక్కలు కమిషన్‌కు వెల్లడిస్తే నిర్వహణ వ్యయం మరింత పెరిగి ఉండేది.
► ఈ భారమంతా ప్రజలపై పడకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు భారీగా సబ్సిడీ ఇచ్చింది. 2015లో ప్రతి యూనిట్‌కు కేవలం 59 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా ప్రస్తుతం రూ.1.46 చొప్పున ఇవ్వడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.
► 2019లో విద్యుత్ ఉత్పత్తి ఖర్చు యూనిట్‌కు రూ.8.82 ఉండగా దుబారాను అరికట్టడంతో ఈ ఏడాది రూ.7.75కి తగ్గింది. దీంతో పాటు ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రూ.1.46 చొప్పున సబ్సిడీ ఇస్తోంది.
ఆర్థిక క్రమశిక్షణతో..
► వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విద్యుత్ శాఖ ఆర్థిక క్రమ శిక్షణ దిశగా అడుగులేస్తోంది. ప్రజల పై విద్యుత్ భారం పడకుండా తొలుత నిర్వహణ వ్యయాన్ని అదుపు లోకి తెచ్చింది. ఇందుకోసం చౌక విద్యుత్ కొనుగోళ్లనే ఎంపిక చేసుకుంది.
► 2019లో గత సర్కారు వైదొలగేనాటికి విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.48,110.79 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం రూ.43,327.56 కోట్లకు తగ్గించారు. అంటే దాదాపు 4,783.23 కోట్ల మేర అనవసర వృథాను అరికట్టారు.
Comments
Please login to add a commentAdd a comment