విద్యుత్‌ ఆంక్షలకు మినహాయింపులు | Exceptions to electricity restrictions in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఆంక్షలకు మినహాయింపులు

Published Sun, Apr 17 2022 3:19 AM | Last Updated on Sun, Apr 17 2022 3:19 AM

Exceptions to electricity restrictions in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి పరిశ్రమలకు అమలుచేస్తున్న ఆంక్షలపై విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూనే పలు పరిశ్రమలు, హెచ్‌టీ వినియోగదారులకు వాటి నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలపై అదనపు చార్జీలు విధించడానికి అనుమతిస్తూ, తద్వారా విద్యుత్‌ డిమాండ్‌ను సమతుల్యం చేసి, కోతలు పెరగకుండా చర్యలు చేపట్టింది.

ఈనెల 22 వరకూ ఆంక్షలు
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్‌ కొరత ప్రభావం రాష్ట్రంపైనా పడిన విషయం తెలిసిందే. రోజుకు సగటున 230 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటే ఇందులో కనీసం 40 మిలియన్‌ యూనిట్లు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కానీ, అక్కడ తీవ్రపోటీతో విద్యుత్‌ దొరకడంలేదు. ఈ నేపథ్యంలో.. గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు ఇబ్బందులు నివారించడానికి పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్‌ హాలిడే ప్రకటించారు. ఇక నిరంతరం విద్యుత్‌ వాడే పరిశ్రమలు తమ వినియోగంలో 50 శాతం తగ్గించుకుని, మిగతా సగంతో నడుపుకునే అవకాశం కల్పించారు. అంతేకాక.. పగటిపూట నడిచే ఇతర పరిశ్రమలు వారాంతపు సెలవుతో పాటు ఈనెల 22 వరకూ మరోరోజు విద్యుత్‌ వినియోగించడం కుదరదు. ఈనెల 8 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 

20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా
ఇలా డిస్కంలు తాము తీసుకున్న నిర్ణయాన్ని, అందుకు దారితీసిన పరిస్థితులను ఏపీఈఆర్‌సీ దృష్టికి తీసుకువెళ్లాయి. వాటిని పరిశీలించిన మండలి.. పవర్‌ హాలిడే, ఇతర నిబంధలను సమర్థిస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 22 విభాగాలకు మాత్రం వీటి నుంచి మినహాయించాలని సూచించింది. అదే విధంగా.. ఈ నిబంధనలను పరిశ్రమలు ఖచ్చితంగా పాటించేలా చేసేందుకు డిస్కంలు చేపట్టిన చర్యలకు ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఇకపై పరిశ్రమలు పవర్‌ హాలిడే, ఇతర నిబంధనలను అతిక్రమించి విద్యుత్‌ వినియోగిస్తే వాటిపై డిమాండ్‌ చార్జీలు విధిస్తారు. అవి ప్రస్తుత ధరలకు రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పవర్‌ హాలిడే రోజు విద్యుత్‌ వాడితే ఒకటిన్నర రెట్లు ఎనర్జీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్యలవల్ల పరిశ్రమలు నిబంధనల మేరకే విద్యుత్‌ వినియోగిస్తాయి. దీనివల్ల సగటున రోజుకు పరిశ్రమల నుంచి ఆదా అవుతున్న 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను గృహ, వ్యవసాయ అవసరాలకు మళ్లించేందుకు అవకాశం ఏర్పడుతుంది.  

మినహాయింపు పొందిన పరిశ్రమలు, హెచ్‌టీ సర్వీసులు..
► ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ 
► ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 
► ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌ 
► వార్తాపత్రికల ప్రింటింగ్, ఎలక్ట్రానిక్‌ మీడియా 
► పోర్టులు, ఏఐఆర్, దూరదర్శన్‌ 
► విమానాశ్రయాలు, విమానయాన సంబంధిత సేవలు
► డెయిరీలు, మిల్క్‌ చిల్లింగ్‌ ప్లాంట్లు, ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు, కోల్డ్‌ స్టోరేజీలు
► ఐస్‌క్రీమ్‌ తయారీ పరిశ్రమలు 
► కేంద్ర ప్రభుత్వ ఆర్‌ అండ్‌ డీ యూనిట్లు
► నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులకు విద్యుత్‌ సరఫరా 
► నావల్‌ డాక్‌యార్డ్, విశాఖపట్నం
► చమురు అన్వేషణ సర్వీస్‌ కనెక్షన్లు, చమురు శుద్ధి కర్మాగారాలు 
► రైల్వే ట్రాక్షన్, రైల్వే వర్క్‌షాప్‌లు, గూడ్స్‌ షెడ్‌లు, రైల్వేస్టేషన్లు 
► ఆసుపత్రులు
► పోలీస్‌స్టేషన్‌లు, అగ్నిమాపక స్టేషన్‌లు 
► రక్షణ సంస్థలు
► వీధి దీపాలు 
► తాగునీటి సరఫరా పథకాలు 
► నీటి పనులు, నీటి పంపింగ్‌ స్టేషన్లు, మురుగునీటి పంపింగ్‌ స్టేషన్లు
► మతపరమైన ప్రదేశాలు 
► యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా
► మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ కర్మాగారాలు   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement