పాలమూరు, న్యూస్‌లైన్: ఇది మండుతున్న వేసవి కాదు.. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఆశించిన మేర విద్యుదుత్పత్తి కూడా ఉంది. అయినా జిల్లాలో ఇప్పటికే అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు గంటలు, మునిసిపాలిటీ, మండలకేంద్రాల్లో మూడు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. ఇకనుంంచి గ్రామాలను ఏ, బీ, సీ, కేటగిరీలుగా విభజించి రోజుకు ఆరు గంటల చొప్పున విద్యుత్ సరఫరాను నిలిపేస్తారు.
ఆదివారం నుంచి అధికారికంగా జిల్లాలో విద్యుత్‌కోతలను అమలుచేయాలని నిర్ణయించారు. దీంతో పండుగల వేళ పల్లెల్లో అంధకారం అలుముకునే పరిస్థితులు నెలకొన్నాయి. వేళాపాళ లేని కరెంట్ కోతలపై రైతన్నలు భగ్గుమంటున్నారు. జిల్లాలో సెప్టెంబర్‌లోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కోతలను విధిస్తూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లో లోడ్ రిలీవ్ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కోతలు అమలుచేస్తున్నామని జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు ప్రాజెక్టులు నిండి నీరంతా వృథాగా పోతుంటే విద్యుదుత్పత్తి పెరగాల్సింది పోయి కోతలు విధించడం ఏమిటని అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామాల్లో గంటలకొద్దీ కోత
గ్రామాల్లో అధికారికంగా రోజుకు ఆరు గంటల విద్యుత్ కోత ప్రకటించినప్పటికీ.. అనధికారికంగా 12 నుంచి 14 గంటల పాటు విధిస్తుండటంతో రైతులు, జనం ఇబ్బందులు పడుతున్నారు. వేళాపాళలేని కరెంట్‌కోతలకు మోటారు పంపుసెట్లపై ఆధారపడి ఖరీఫ్ పంటలు సాగుచేసిన రైతులు గగ్గోలుపెడుతున్నారు. జిల్లాలో 1.85 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటి పరిధిలో సుమారు మూడు లక్షల హెక్టార్ల మేర మోటార్ల ద్వారా నీటిని పారిస్తున్నారు.
ప్రస్తుతం విద్యుత్‌కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు 1.50 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగించే పరిశ్రమలు 75 వరకు ఉన్నాయి. నెలలో 12 రోజుల పాటు భారీ పరిశ్రమలకు విద్యుత్‌ను నిలిపివేస్తే ఆయా కంపెనీలకు కోట్లల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో లక్షలాదిమంది కార్మికుల ఉపాధికి ఆటంకం కలిగే అవకాశం ఉంది. జిల్లాలో 51వేల వరకు వాణిజ్య వ్యాపార సంస్థలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. చిన్నతరహా పరిశ్రమలు సుమారు ఐదువేలు ఉన్నాయి. వీటికి ప్రతిరోజు నాలుగు లక్షల యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాల్సి ఉటుంది. విద్యుత్ కోతల నేపథ్యంలో ఈ పరిశ్రమలకు నెలలో 8 రోజులపాటు విద్యుత్ సరఫరాను నిలిపేయాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న సుమారు 10వేల మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదిలాఉండగా జిల్లా వ్యాప్తంగా ట్రెడిషనల్ రైస్ మిల్లులు 200, నాన్‌ట్రెడిషన్ రైస్ మిల్లులు మరో 100 ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల రైస్ మిల్లులు కూడా నడపలేని పరిస్థితి నెలకొంది.
కోతలు షురూ..!
Published Mon, Sep 2 2013 5:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement