‘కోత’లు మొదలు
- అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేత
- లోడ్ రిలీఫ్ పేరిట నిత్యం అమలు
సాక్షి, విశాఖపట్నం : చలి వాతావరణం ఇంకా పూర్తిగా వదల్లేదు. వేసవి ఇంకా రాలేదు. అయినా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అధికారికంగా షెడ్యూల్ ఖరారు చేయడమే మిగిలుంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలో కనిష్టంగా గంట నుంచి గరిష్టంగా ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు.
ఇన్నాళ్లూ పట్టణ, నగర ప్రాంతాలకు మినహాయింపునిచ్చిన డిస్కం ఇపుడు వాటికీ అత్యవసరం పేరిట కోతలు విధిస్తోంది. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా రోజుకు 1650 మెగావాట్లు దాటొద్దన్న ఆదేశాలున్నాయి. షెడ్యూల్ మాత్రం 1550 మెగావాట్లే. దీంతో మిగులు వ్యత్యాసం సర్దుబాటు చేసేందుకు లోడ్ రిలీఫ్(ఎల్‌ఆర్) పేరిట కోతలు పెట్టకతప్పట్లేదని అధికారులు చెప్తున్నారు. శనివారానికైతే.. షెడ్యూల్ 1539 మెగావాట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.
కోతల వేళలివీ..
గ్రామాల్లో రోజూ ఆరు గంటలు కోత విధిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మూడేసి గంటలు చొప్పున విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు.
మండల కేంద్రాల్లో రోజూ ఉదయం గంట న్నర, సాయంత్రం గంటన్నరపాటు విద్యు త్ సరఫరా నిలిపేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి డివిజన్ పరిధి లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల మధ్య, విజయనగరం, ఏలూరు డివిజన్ల పరిధిలో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఈ అనధికారిక కోతలు అమలవుతున్నాయి.
మున్సిపాలిటీల్లో రోజూ గంటన్నర కోతలు విధిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు డివిజన్లలో ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, విజయనగరం, రాజమండ్రిలో ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు.
జిల్లా కేంద్రాలు, నగరాల్లో కూడా గంటపాటు కోతలు అమలవుతున్నాయి. విశాఖలోని జోన్-1 పరిధిలో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, జోన్-2, 3 పరిధిలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ కోతలున్నాయి.
అయితే వీటిని అధికారిక షెడ్యూల్‌గా మాత్రం ధ్రువీకరించట్లేదు. హైదరాబాద్ నుంచి అధికారిక ఉత్తర్వులొచ్చాక షెడ్యూల్ ప్రకటించనున్నట్టు ఈపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు.