ఫ్యూజులు కట్
విజయనగరం మున్సిపాలిటీ : తమ్ముడు.. తమ్ముడే... పేకాట.. పేకాటే... అన్న నానుడిని జిల్లా విద్యుత్ శాఖ ఎట్టకేలకు అలవర్చుకుంది. దీర్ఘకాలికంగా ప్రభుత్వ శాఖలు చెల్లించని విద్యుత్ బిల్లుల బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో వివి ద శాఖల నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల బకాయిల మొత్తం రూ.32.18 కోట్లు. ఈ బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది.
ఎల్.టి. విభాగంలో గృహ విద్యుత్ కనెక్షన్ల నుంచి రూ.1.82 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. మేజర్ పంచాయతీల నుంచి రూ 2.42 కోట్లు, మైనర్ పంచాయతీల నుంచి రూ 12.05 కోట్లు వసూలు కావలసి ఉంది. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల నుంచి రూ.75 లక్షలు, జిల్లాలో 39 మంచి నీటి ప్రాజెక్టులను నడుపుతున్న ఆర్‌డబ్ల్యూస్ నుంచి రూ 2.33 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. అంతేకాకుండా హెచ్.టి.విభాగంలో కనెక్షన్‌లు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల నుంచి రూ 2.21 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. అందులో రూ 56 లక్షల వరకూ వాటర్ వర్క్స్ విభాగం నుంచి రావాల్సి ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
పరిశ్రమలదీ అదే దారి...
పలు పరిశ్రమల నుంచి కూడా రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉన్నా, వారు చెల్లించడం లేదు. బొబ్బిలిలోని యోనాస్ స్మెల్టర్ నుంచి రూ.5 కోట్లు, గర్భాంలోని స్వస్తిక్ ఎల్లాయీస్ పరిశ్రమల నుంచి రూ.2 కోట్లు, కొత్తవలస, పూసపాటిరేగ ప్రాంతాల్లో ఉన్న మరో రెండు పరిశ్రమల నుంచి రూ.3.06 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరగడంతో విద్యుత్ సంస్థలకు రావలసిన బకాయిలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిచారు. దీంతో పెండింగ్ బకాయిల వసూళ్లపై కదలిక వచ్చింది.
నోటీసులకు స్పందన లేకనే..
బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ శాఖలకు విద్యుత్ శాఖాధికారులు నోటీసులు పంపిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లేదని, లేకపోతే బడ్జెట్ లేదంటూనే ఆయా శాఖలు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆర్‌ఆర్‌యాక్ట్ ఉపయోగించి ఆయా శాఖల ఆస్తులు జప్తు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈవిషయంపై ఇప్పటికే కలెక్టర్‌కు నివేదించిన విద్యుత్ శాఖ అధికారులు అనుమతి లభిస్తే వెంటనే చర్యలు ప్రారంభిస్తారు.