వరుసగా నాలుగో రోజూ విద్యుత్ కోతలు
రోజులో కనీసం 12 నుంచి 15 గంటల పాటు అమలవుతున్న కోత
దయనీయంగా ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి
ఎండిపోతున్న వరి, చెరకు, మొక్కజొన్న, కూరగాయల పంటలు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లా ప్రజలను విద్యుత్ కోతలు అల్లాడిస్తున్నాయి. ఓ వైపు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు కరెంట్ కోతలు ప్రజలను మగ్గబెట్టేస్తున్నాయి. విశాఖ జిల్లా పరవాడ వద్ద గల 400 కేవీ పవర్‌గ్రిడ్ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో బుధవారం ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట ఉదయం నుంచి రాత్రి వరకు కోతలు విధించారు. నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా రోజులో 12 నుంచి 15 గంటల పాటు కోత విధిస్తుండగా... బుధవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
విజయనగరం పట్టణంలో ఉదయం 2 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో ఈఎల్‌ఆర్ అమలు చేశారు. పార్వతీపురం పరిసరాల్లో ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మధ్యలో 10 నిమిషాలు చొప్పున మూడు మార్లు మాత్రమే సరఫరా ఇచ్చి నిలిపివేశారు. చీపురుపల్లి పరిసరాల్లో సుమారు 6 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సరఫరా నిలిచిపోవడంతో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రుల్లో రోగులు పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ వార్డులకే జనరేటర్‌ల ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. సాధారణ వార్డుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. జిల్లా కేంద్రంలో గల ఘోషా ఆస్పత్రిలో గర్భిణులు, అప్పుడే పుట్టిన చిన్నారులు ఉక్కపోతకు తాళలేక అల్లాడిపోతున్నారు. గర్భిణులు ఆస్పత్రి బయట సేదతీరుతుండగా.. చిన్నారుల వద్ద రోగి బంధువులు విసనకర్రలతో కుస్తీలు పడుతున్నారు.
జిల్లా కేంద్రంలో గాడాంధకారం
విజయనగరం పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెండు గంటలపాటే కోత విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఏకధాటిగా విద్యుత్ సరఫరా నిలుపు చేశారు. దీంతో అన్ని వర్గాల ప్రజలూ అవస్థలు పడ్డారు. రహదారుల్లో చీకట్లు అలుముకున్నాయి. గురజాడ అప్పారావు రోడ్డు, గంటస్తంభం జంక్షన్, మూతులాంతర్ల జంక్షన్, కన్యకాపరమేశ్వరి రోడ్డు తదితర ప్రాంతాల్లో గాడాంధకారం అలుముకుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సమాచారం ఇవ్వని అధికారులు
అనధికారకంగా కోతలు విధిస్తున్న విద్యుత్ శాఖాధికారులు.. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు సమాచారం అడిగే వారిపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎండిపోతున్న పంటలు
రబీ సీజన్‌లో పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. నాలుగు రోజులుగా ఎడాపెడా విధిస్తున్న విద్యుత్ కోతలతో పంటలకు కష్టకాలమొచ్చింది. కొద్ది నెలలుగా వర్షపు జాడ లేకపోగా... విద్యుత్ మోటార్లతో పంట సాగు చేస్తున్న రైతాంగానికి తాజా విద్యుత్ కోతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 70వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వాటి ఫలం చేతికి అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వరి, మొక్కజొన్న, కూరగాయలు, చెరకు పంటలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి. వర్షాలు లేక.. కరెంట్ కోతలతో మోటార్ల ద్వారా నీరందించే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు లోనవుతున్నారు.
ఉడికించేస్తోంది!
Published Thu, Apr 28 2016 12:04 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement