రంపపుకోత!
‘‘తమ ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం చిన్న పాటి అంతరాయాలు మినహా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నాం. అక్టోబర్ 2 నుంచి 24 గంటల పాటు సరఫరా ఇస్తాం.’’ ఇవీ ఇటీవల రాష్ట్ర మంత్రి మృణాళిని జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. అయితే సమీక్ష నిర్వహించిన పది రోజులకే జిల్లాలో కోతలు పునరావృతమయ్యాయి. గత రెండు రోజులుగా పల్లె , పట్టణం తేడా లేకుండా గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ : అత్యవసర విద్యుత్ కోతలతో జిల్లా ప్రజలు రంపపుకోతను చవిచూస్తున్నా రు. ఇటు మండే ఎండలు, అటు దోమ ల దాడి, మరో పక్క విద్యుత్ కోతలతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. రోగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల పరిస్థితి వర్ణాణాతీతంగా ఉంది. విద్యుత్‌పై ఆధారపడి నిర్వహించే జిరాక్స్ తదితర చిరు వ్యాపారుల పరిస్థితి అయోమయంగా మారింది.రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నెలకొన్న సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు ప్రధాన కార ణంగా తెలుస్తోంది.
అధికారుల సమాచారం మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టులో గల యూనిట్-5లో 210 మెగావాట్లు, సింహాద్రి పవర్ ప్రాజెక్టులో 500 మెగావాట్లు, వీటీపీఎస్‌లో గల యూనిట్-1లో 210 మెగావాట్లు, ఎన్‌టీపీసీ ద్వారా ఉత్పత్తి కావాల్సిన 300 మెగావాట్ల విద్యుత్తి నిలిచిపోయింది. అంతేకాకుండా సెంట్రల్ గ్రిడ్‌స్టేషన్ నుంచి రావాల్సిన మరో 1500 మెగావాట్ల విద్యుత్‌కు బ్రేక్ పడిం ది. ఈ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో జి ల్లాలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అత్యవసర కోతలు విధిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
6గంటల పాటు నిలిచిపోతున్న సరఫరా:
జిల్లా వ్యాప్తంగా రోజులో 5 నుంచి 6 గంటల పాటు సరఫరా నిలిపివేస్తుండడంతో అన్ని వర్గాల వినియోగదారులు సతమతమవుతున్నారు. ఇటు వర్షాభావ పరిస్థితులు, అటు ఎండలు మండిపోతుండడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి లోటు పేరుతో అధికారులు కోతలు విధించటం వినియోగదారులకు మింగుడు పడటం లేదు. చిరువ్యాపారాలు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బుధవారం జిల్లా కేంద్రంలో ఉదయం 11.40 గంటల నుంచి మధ్యాహ్నం 13.25 గంటల వరకు మళ్లీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7.04 గంటల నుంచి 9.15 గంటల వరకు మళ్లీ మధ్యాహ్నం 3.40 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9.15 నుంచి 10.25 గంటల వరకూ సరఫరా నిలిచిపోయింది.
గురువారం జిల్లా కేంద్రంలో ఉదయం 9.10 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.10 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. అదే మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 11.15 నుంచి 13.55 వరకు సరఫరా నిలిపివేశారు. గురువారం రాత్రి 6.55 నుంచి గంటపాటు జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకు సరఫరాలో కోత విధించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఫీడర్‌లో అర్ధరాత్రి వేళ కోతలు విధిస్తున్నట్లు పల్లె ప్రజలు వాపోతున్నారు.