ఇవేం కోతల్రా బాబు...
శ్రీకాకుళం సిటీ: వేళాపాళా లేకుండా గంటల కొద్ది విధిస్తున్న విద్యుత్ కోతలతో ప్రజలు విసిగెత్తుపోతున్నారు. అధికారికంగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని చెప్పుకొస్తున్న ఆ శాఖాధికారులు..నిత్యం విధిస్తున్న కోతలపై మాత్రం తలోమాట చెబుతున్నారు. కోతలకంటూ ఓషెడ్యూల్ అమలు చేస్తే ఇబ్బందులు ఉండవని తెలిసినప్పటికీ, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో అనధికారికంగా విద్యుత్ కోతలు ఏకంగా 8 గంటల పాటు విధిస్తున్నారు. వేసవికాలం మొదలు నుంచి రోజురోజుకీ ఇఎల్‌ఆర్ (ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్) పేరిట అత్యధికంగా 8 గంటల వరకు కోతలుంటున్నాయి. వాస్తవానికి జిల్లాకు 250 మెగా వాట్లు విద్యుత్ వినియోగానికి అవసరం కాగా,
వీటిలో పరిశ్రమలకు 110 మెగా వాట్లు, వ్యవసాయానికి 35, జిల్లా కేంద్రానికి 22, మున్సిపల్ పట్టణాలకు 17, మండల కేం ద్రాలకు 24, గ్రామీణ ప్రాంతాలకు 42 మెగా వాట్లు విద్యుత్ అవసరం కాగా, కేటాయిం పుల్లో కోతలుండడంతో కేవలం 225 మెగావాట్లు మాత్రమే జిల్లా వినియోగానికి అందుతోంది. దీంతో సుమారు 25 మెగావాట్లు డెఫిసిట్‌గా ఉండడంతో అన్ని వర్గాలకు కేటాయింపుల్లో కోత పడింది. ముఖ్యంగా వ్యవసాయూనికి 7గంటల ఉచిత విద్యుత్ సరఫరాను మూడు విడతల్లో కేవలం 4 గంటల వరకే ఇస్తున్నారు. అలాగే పరిశ్రమల్లో పవర్ హాలిడే కు బదులుగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6వరకు విద్యుత్ సరఫరాను కేవలం 10 శాతమే (లైటింగ్ లోడ్) అందిస్తున్నారు. విద్యుత్ కోతల కారణంగా ఎంతో మంది చిరు వ్యాపారులు, విద్యుత్ ఆధారంగా పనిచేసే చిన్న చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతున్నారు.