కరెంట్ కట్‌కట!
శ్రీకాకుళం:అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఏదీ లేదు అన్నట్లుంది తుపాను బాధితులకు సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి. బాధితులకు అండగా ఉంటాం.. అన్నీ సమకూరుస్తామని డాంభికాలు పలుకుతున్న సీఎం మాటలు కోటలు దాడుతున్నాయే తప్ప చేతలు గడప దాటడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, బాధిత ప్రాంతాల్లో పర్యటనల తీరే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తుపాను గాలులకు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని ప్రభుత్వం చెప్పుకొంటున్నా వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అలాగే బాధితులను పరామర్శించేందుకు రెండుసార్లు జిల్లాకు వచ్చిన సీఎం మొదటిసారి రెండు ప్రాంతాల్లో, రెండోసారి ఒకే గ్రామంలో మొక్కుబడిగా పర్యటించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వీడని విద్యుత్ సంక్షోభం
హుదూద్ తుపాను సందర్భంగా వీచిన పెనుగాలుల కారణంగా ఈ నెల 11న రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తర్వాత గాలులకు విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో జిల్లా అంతటా సరఫరా నిలిచిపోయింది. ఐదు రోజుల తర్వాత గత గురువారం రాత్రి మొదట శ్రీకాకుళం పట్టణానికి సరఫరా పునరుద్ధరించారు. తర్వాత మిగిలిన మున్సిపాలిటీలు, మండల కేంద్రాలకు పునరుద్ధరించారు. అయితే ఆ ముచ్చట ఒక్కరోజు కూడా నిలవలేదు. గత కొద్దిరోజులుగా జిల్లాకు అవసరమైన రెగ్యులర్ కోటాలో 30 శాతం విద్యుత్ మాత్రమే గ్రిడ్ నుంచి ఇస్తుండటంతో రోజులో అధిక భాగం కోతలే విధించాల్సి వస్తోంది. జిల్లాకు రోజుకు 230 మెగావాట్ల విద్యుత్ అవసరం.
ఇందులో వ్యవసాయ, పరిశ్రమ విద్యుత్‌ను మినహాయిస్తే గృహ, వాణిజ్య సర్వీసులకు 120 మెగవాట్లు అవసరం. అయితే శ్రీకాకుళం పట్టణానికి సరఫరా పునరుద్ధరించిన రోజు 50 మెగావాట్లు సరఫరా కాగా.. ఆ తర్వాత నుంచీ జిల్లా మొత్తానికీ 40 నుంచి 60 మెగావాట్లు మాత్రమే ఇస్తున్నారు. గ్రామాలకు ఇంకా సరఫరా పునరుద్ధరించనేలేదు. అయినా ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్ జిల్లా అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఫలితంగా పునరుద్ధరణ జరిగిన పట్టణాలు, మండల కేంద్రాల పరిస్థితి కూడా కరెంటు లేనట్లుగానే ఉంటోంది. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో అధికారులే చెప్పలేని పరిస్థితి నెలకొంది. రోజుకు 15 నుంచి 18 గంటల వరకు కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి వేళ కోతలు విధించరాదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా జిల్లాలో గత రెండు రోజులుగా రాత్రి పూట కూడా 5 నుంచి 6 గంటలు కోత విధిస్తున్నారు.
దీపావళి రోజు రాత్రి 9.30 గంటల నుంచి 11.30 వరకు కోత అమలు చేసిన అధికారులు, ఆ తర్వాత మళ్లీ అర్ధరాత్రి 2 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటలకు సరఫరా నిలిపివేశారు. వ్యవసాయ, పరిశ్రమల విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతితక్కువ విద్యుత్ ఇస్తుండటం వల్ల గ్రామాలకు సరఫరా పునరుద్ధరణలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలని అంతవరకు విశాఖ నుంచి కదిలేది లేదని శపథం చేసిన ముఖ్యమంత్రి పాక్షికంగా పునరుద్ధరణ జరగడంతోనే పనైపోయిందనుకుంటున్నట్లు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగతా జిల్లాల్లో ఈ స్థాయిలో కోతలు లేకున్నా.. తుపాను ప్రభావిత జిల్లాలకే విధించడాన్ని విమర్శలకు తావిస్తోంది.
రెండుసార్లు పర్యటించినా..మరోవైపు బాధితులకు పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు రెండుసార్లు జిల్లాకు వచ్చారు. తొలి పర్యటనలో పొందూరు మండలం మొదలవలస గ్రామం, శ్రీకాకుళం పట్టణంలోని కృష్ణాపార్కు ప్రాంతం సందర్శించారు. అయితే చీకటి పడిన తర్వాత వచ్చిన ఆయన ఇలా చూసి.. అలా వెళ్లిపోయారు. అలాగే దీపావళి రోజు శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామాన్ని సందర్శించారు.
కొద్ది నిమిషాల్లోనే వెళ్లిపోయారు. రెండు పర్యటనల్లోనూ పాత హామీలే తప్ప కొత్త వరాలేమీ ఇవ్వలేదు. కనీసం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయమైనా ప్రస్తావించలేదు. ఈమాత్రం దానికి హెలికాప్టర్లలో తిరుగుతూ నిధులు దుర్వినియోగం చేయడమెందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా దీపావళి పండుగ రోజు వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడాన్ని అధికార యంత్రాంగంతోపాటు అధికార పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.