కట్టకపోతే పవర్‌ కట్‌! | Power Cuts in Srikakulam district | Sakshi
Sakshi News home page

కట్టకపోతే పవర్‌ కట్‌!

Published Sun, Sep 30 2018 7:10 AM | Last Updated on Sun, Sep 30 2018 7:11 AM

Power Cuts in Srikakulam district - Sakshi

మొన్న ఆమదాలవలస తహసీల్దార్‌ కార్యాలయం..నిన్న శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత. అలాగే గార మండలంలోని బందరువానిపేట, కొర్ని, కొర్లాం, ఎచ్చెర్ల మండలంలోని దోమం, ఎస్‌ఎం.పురం, ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం పంచాయతీ కార్యాలయాలకు అధికారులు విద్యుత్‌ సరఫరాను కట్‌ చేశారు. అదేంటీ ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలు కదా.. ఎందుకు ఇలాంటి చర్యలకు దిగారనే అనుమానం రావడం సహజమే. దీనిపై విద్యుత్‌ అధికారులను ప్రశ్నిస్తే.. ఆయా కార్యాలయాల విద్యుత్‌ వినియోగ చార్జీలు చెల్లించకపోవడమేనని స్పష్టం చేస్తున్నారు. విద్యుత్‌ బకాయిలున్న కార్యాలయాలకు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టేందుకు సంబంధిత  అధికారులు సిద్ధమయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖాధికారులతో పాటు పెండింగ్‌ బిల్లుల బకాయిదారుల గుండెల్లో ‘పవర్‌’ రైళ్లు పరిగెడుతున్నాయి. 

అరసవల్లి: జిల్లాలో తూర్పు ప్రాంత విద్యుత్‌ పం పిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) ఆధ్వర్యంలో విద్యుత్‌ను వినియోగిస్తున్న పలు ప్రభుత్వ కార్యాలయాలు తమ వినియోగ చార్జీలను సకాలంలో చెల్లించడం లేదు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ పెండింగ్‌లు సుమారుగా రూ. 85 కోట్లు వరకు పేరుకుపోయాయి. దీంతో విద్యుత్‌ పంపిణీ  సంస్థల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెండింగ్‌ బకాయిల శాఖలపై పవర్‌ యుద్ధం ప్రకటించారు. ఎటువంటి వెనుకడుగు లేకుండా పలు కార్యాలయాల విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేశారు. దీంతో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

అయితే రాజకీయ ఒత్తిళ్లు మొదలైనప్పటికీ, అత్యవసర విభాగ శా>ఖలను మినహాయించి మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలను వసూళ్లు చేసేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎల్‌టీ (లో టెన్షన్‌) కనెక్షన్లు గల ప్రభుత్వ శాఖల నుంచి రూ.5.56 కోట్లు బకాయిలుండగా, హెచ్‌టీ (హై టెన్షన్‌) కనెక్షన్లు గల ప్రభుత్వ శాఖల నుంచి రూ.2.29 కోట్లు వరకు బకాయిలున్నాయి. కేవలం పంచాయతీ కార్యాలయాలు, మున్సిపాల్టీల వంటి స్థానిక సంస్థల నుంచి ఏకంగా రూ.75.34 కోట్లు వరకు విద్యుత్‌ బకాయిలున్నాయి. దీంతో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి మొత్తంగా రూ. 82.99 కోట్లు వరకు బకాయిలున్నాయి. ఈమేరకు బకాయి వసూళ్లకు ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. 

కఠిన నిర్ణయాలపై అడుగులు:
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ప్రభుత్వ శాఖల కార్యాలయాల నుంచి సుమారు వందల కోట్లలో విద్యుత్‌ బకాయిలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఈనెలాఖరులోగా దాదాపుగా విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులకు ఆదేశాలు పంపింది. ఈమేరకు ఈపీడీసీఎల్‌ ఆధ్వర్యంలో జిల్లా సర్కిల్‌ పరిధిలో ఉన్న పెండింగ్‌ బకాయిదారులు, ప్రభుత్వ శాఖల కార్యాలయాల వివరాలను సేకరించారు. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బి.దేవవరప్రసాద్‌ ఆ«ధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి ప్రత్యేక బృందాలు పర్యటించి, బకాయి పడ్డ ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ కనెక్షన్లను కట్‌ చేసేశారు. 

దీంతో జిల్లా వ్యాప్తంగా ఈ వపర్‌ యుద్ధం చర్చనీయాంశమైంది. ఇదిలావుంటే ప్రభుత్వం పలు శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు చాలా దారుణంగా కేటాయించడంతోనే విద్యుత్‌ బకాయిలను చెల్లించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు నెలల్లో వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను విద్యుత్‌ నియంత్రణ మండలికి ఇంధన శాఖ సమర్పించాల్సి ఉంటుంది. ఇంత భారీగా ఉన్న పెండింగ్‌ బిల్లులపై కమిషన్‌కు వివరణ ఇవ్వడానికి ఈపీడీసీఎల్‌ ఇష్టంగా లేదు. దీంతో యుద్ధప్రాతిపదికన బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టారు. ఈక్రమంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసేందుకు నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement