గిరిజన గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించాలన్న ఉద్దేశంతో నెడ్‌కాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు మొరాయిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కాస్తంత వెలుగుతున్నా ఆ తర్వాత పూర్తిగా పనిచేయకపోవడంతో ఏజెన్సీ గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. సోలార్ దీపాలు సక్రమంగా వెలగకపోవడం ఏనుగులు ప్రభావిత గ్రామాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ వైపు నుంచి ఏనుగులు వస్తాయో తెలుసుకునే పరిస్థితి లేకబిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
ఏనుగుల ప్రభావిత గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా ఉండడానికి సోలార్ లైట్లు ఎంతగానో దోహదపడతాయి. వెలుగును చూస్తే ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఏనుగుల ప్రభావిత గ్రామాలైన బిల్లుమడ, గుమ్మడ, కురసింగి, మీనకోట, బర్న, పెద్దపల్లంకి, కుంబి, దోనుబాయి, పెదరామ తదితర గ్రామాల్లో లైట్లు సరిగ్గా వెలగడం లేదని గిరిజనులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి 12 గంటలు దాటితే పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇటీవల ఏనుగులు గ్రామాల్లోకి చొరబడ్డాయని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయమై నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ రాజు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా లైట్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీతంపేట: ఏజెన్సీలో సౌర విద్యుత్ కాంతులను అందించి గిరిజన గ్రామాలకు వెలుగులనివ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు మొరాయిస్తున్నాయి. మారుమూల ఎత్తయిన కొండల ప్రాంతాల్లోని గ్రామాలు, వీధి దీపాలు లేని ప్రాంతాలు, లైట్లు ఉన్నా తరచూ విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతున్న గ్రామాలను దృష్టిలో పెట్టుకుని నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో ఐఏపీ నిధులతో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. ముందుగా చేసిన సర్వే ప్రకారం ఐటీడీఏ పరిధిలోని సీతంపేట, పాలకొండ, బూర్జ, ఎల్.ఎన్.పేట, కొత్తూరు, నందిగాం, టెక్కలి, మెళియాపుట్టి, భామిని, సారవకోట, పాతపట్నం, హిరమండలం, సారవకోట, సరుబుజ్జిలి, వీరఘట్టం, సోంపేట మండలాల్లోని గిరిజన గ్రామాలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాల్లో సుమారు 400 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి ఒకటి నుంచి ఆరు వరకు లైట్లు వేశారు. ప్రస్తుతం ఆ లైట్లలో చాలావరకు పనిచేయడం లేదు. దీంతో గ్రామాల్లో అంధకారం నెలకొంటోంది.
ఇబ్బందులు పడుతున్నాం..
సోలార్ లైట్లు సరిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు ఎక్కడా వెలగని పరిస్థితి ఉంది. ఏడాదిగా మొరాయిస్తునే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మరమ్మతులు చేయించాలి.
-ఎస్.ముఖలింగం, ఇప్పగూడ
ఫిర్యాదు చేసినా..
ఏనుగుల ప్రభావిత గ్రామాల్లో భయంగా గడపాల్సి వస్తోంది. లైట్ల విషయమై గతంలో చాలా సా ర్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఏనుగులు ఎప్పుడు గ్రామాల్లోకి ప్రవేశిస్తాయోననే భయాంగా ఉంది.
- బి.ఆదినారాయణ, చిన్నబగ్గ
అర్దరాత్రయితే ...అంధకారమే
Published Sun, May 15 2016 12:27 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement