emergency load relief
-
రంపపుకోత!
‘‘తమ ప్రభుత్వం విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం చిన్న పాటి అంతరాయాలు మినహా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నాం. అక్టోబర్ 2 నుంచి 24 గంటల పాటు సరఫరా ఇస్తాం.’’ ఇవీ ఇటీవల రాష్ట్ర మంత్రి మృణాళిని జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. అయితే సమీక్ష నిర్వహించిన పది రోజులకే జిల్లాలో కోతలు పునరావృతమయ్యాయి. గత రెండు రోజులుగా పల్లె , పట్టణం తేడా లేకుండా గంటల తరబడి కోతలు విధిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : అత్యవసర విద్యుత్ కోతలతో జిల్లా ప్రజలు రంపపుకోతను చవిచూస్తున్నా రు. ఇటు మండే ఎండలు, అటు దోమ ల దాడి, మరో పక్క విద్యుత్ కోతలతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. రోగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల పరిస్థితి వర్ణాణాతీతంగా ఉంది. విద్యుత్‌పై ఆధారపడి నిర్వహించే జిరాక్స్ తదితర చిరు వ్యాపారుల పరిస్థితి అయోమయంగా మారింది.రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో నెలకొన్న సాంకేతిక లోపంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ఇందుకు ప్రధాన కార ణంగా తెలుస్తోంది. అధికారుల సమాచారం మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టులో గల యూనిట్-5లో 210 మెగావాట్లు, సింహాద్రి పవర్ ప్రాజెక్టులో 500 మెగావాట్లు, వీటీపీఎస్‌లో గల యూనిట్-1లో 210 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి కావాల్సిన 300 మెగావాట్ల విద్యుత్తి నిలిచిపోయింది. అంతేకాకుండా సెంట్రల్ గ్రిడ్‌స్టేషన్ నుంచి రావాల్సిన మరో 1500 మెగావాట్ల విద్యుత్‌కు బ్రేక్ పడిం ది. ఈ ప్రభావం జిల్లాపై పడింది. దీంతో జి ల్లాలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అత్యవసర కోతలు విధిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 6గంటల పాటు నిలిచిపోతున్న సరఫరా: జిల్లా వ్యాప్తంగా రోజులో 5 నుంచి 6 గంటల పాటు సరఫరా నిలిపివేస్తుండడంతో అన్ని వర్గాల వినియోగదారులు సతమతమవుతున్నారు. ఇటు వర్షాభావ పరిస్థితులు, అటు ఎండలు మండిపోతుండడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి లోటు పేరుతో అధికారులు కోతలు విధించటం వినియోగదారులకు మింగుడు పడటం లేదు. చిరువ్యాపారాలు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బుధవారం జిల్లా కేంద్రంలో ఉదయం 11.40 గంటల నుంచి మధ్యాహ్నం 13.25 గంటల వరకు మళ్లీ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7.04 గంటల నుంచి 9.15 గంటల వరకు మళ్లీ మధ్యాహ్నం 3.40 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9.15 నుంచి 10.25 గంటల వరకూ సరఫరా నిలిచిపోయింది. గురువారం జిల్లా కేంద్రంలో ఉదయం 9.10 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.10 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. అదే మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 11.15 నుంచి 13.55 వరకు సరఫరా నిలిపివేశారు. గురువారం రాత్రి 6.55 నుంచి గంటపాటు జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకు సరఫరాలో కోత విధించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఫీడర్లో అర్ధరాత్రి వేళ కోతలు విధిస్తున్నట్లు పల్లె ప్రజలు వాపోతున్నారు. -
ఇవేం కోతల్రా బాబు...
శ్రీకాకుళం సిటీ: వేళాపాళా లేకుండా గంటల కొద్ది విధిస్తున్న విద్యుత్ కోతలతో ప్రజలు విసిగెత్తుపోతున్నారు. అధికారికంగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని చెప్పుకొస్తున్న ఆ శాఖాధికారులు..నిత్యం విధిస్తున్న కోతలపై మాత్రం తలోమాట చెబుతున్నారు. కోతలకంటూ ఓషెడ్యూల్ అమలు చేస్తే ఇబ్బందులు ఉండవని తెలిసినప్పటికీ, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో అనధికారికంగా విద్యుత్ కోతలు ఏకంగా 8 గంటల పాటు విధిస్తున్నారు. వేసవికాలం మొదలు నుంచి రోజురోజుకీ ఇఎల్ఆర్ (ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్) పేరిట అత్యధికంగా 8 గంటల వరకు కోతలుంటున్నాయి. వాస్తవానికి జిల్లాకు 250 మెగా వాట్లు విద్యుత్ వినియోగానికి అవసరం కాగా, వీటిలో పరిశ్రమలకు 110 మెగా వాట్లు, వ్యవసాయానికి 35, జిల్లా కేంద్రానికి 22, మున్సిపల్ పట్టణాలకు 17, మండల కేం ద్రాలకు 24, గ్రామీణ ప్రాంతాలకు 42 మెగా వాట్లు విద్యుత్ అవసరం కాగా, కేటాయిం పుల్లో కోతలుండడంతో కేవలం 225 మెగావాట్లు మాత్రమే జిల్లా వినియోగానికి అందుతోంది. దీంతో సుమారు 25 మెగావాట్లు డెఫిసిట్గా ఉండడంతో అన్ని వర్గాలకు కేటాయింపుల్లో కోత పడింది. ముఖ్యంగా వ్యవసాయూనికి 7గంటల ఉచిత విద్యుత్ సరఫరాను మూడు విడతల్లో కేవలం 4 గంటల వరకే ఇస్తున్నారు. అలాగే పరిశ్రమల్లో పవర్ హాలిడే కు బదులుగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6వరకు విద్యుత్ సరఫరాను కేవలం 10 శాతమే (లైటింగ్ లోడ్) అందిస్తున్నారు. విద్యుత్ కోతల కారణంగా ఎంతో మంది చిరు వ్యాపారులు, విద్యుత్ ఆధారంగా పనిచేసే చిన్న చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. -
పవర్‌కట్‌కు ఉందో ఆన్సర్
విద్యుత్ కోతలతో ఇన్వర్టర్లకు పెరుగుతున్న డిమాండ్ అనూహ్యంగా పెరిగిన ధరలు ఎలక్ట్రీషియన్లకు చేతినిండా పని రాయవరం, న్యూస్‌లైన్ : వేసవి పూర్తిగా రాకుండానే విద్యుత్ శాఖ కోతల సమయాన్ని పెంచింది. దీంతో ఇన్వర్టర్లకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల విద్యుత్ అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో సుమారు ఆరు గంటలు, పట్టణాల్లో నాలు గు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. దీనికితోడు పలుచోట్ల స్థానిక మరమ్మతుల పేరుతో అనధికార కోతలు కూడా వీటికి తోడవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉండ డం, ఉక్కపోత పెరిగిపోవడంతో ప్రజలు ఇన్వర్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కంపెనీలను బట్టి ధరలు కంపెనీలనుబట్టి ఇన్వర్టర్ల ధరలు ఉంటున్నాయి. ఒక ఫ్యాన్, లైటుకు 100 ఆంపియర్ బ్యాటరీ, 400 వాట్ల సామర్థ్యంతో కూడిన ఇన్వర్టర్లు రూ.11 వేలకు లభిస్తున్నాయి. చిన్నపాటి సామర్థ్యం గల ఇన్వర్టర్లు రూ.10 వేల నుంచి కూడా అందుబాటులో ఉంటు న్నాయి. సామర్థ్యాన్నిబట్టి వీటి ధర రూ.40 వేల వరకూ కూడా ఉంటోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే కంపెనీలు, సామర్థ్యాన్నిబట్టి బ్యాటరీల ధర లు రూ.100 నుంచి రూ.వెయ్యి వరకూ పెరిగాయి. సోలార్ ఇన్వర్టర్లు సోలార్ ఇన్వర్టర్లకు కూడా ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. విద్యుత్ సరఫరా అయ్యే సమయంలోనే సాధారణ ఇన్వర్టర్ బ్యాటరీ చార్జ అవుతుంది. ఆ సమయంలో ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. సోలార్ ఇన్వర్టర్లకైతే కేవలం సూర్యరశ్మి ద్వారానే బ్యాటరీ చార్జింగ్ జరుగుతుంది. దీనిని వినియోగించడం వల్ల ఇటు విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ ఆదా కూడా జరుగుతుంది. సోలార్ ఇన్వర్టర్ల ధర కంపెనీనిబట్టి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంది. చేతినిండా పని.. ఒక ఇన్వర్టర్ వేయాలంటే ఎలక్ట్రీషియన్ ప్రత్యేకంగా ఆ ఇంటికి వైరింగ్ చేయాలి. ఇన్వర్టర్లు వేయించుకునేవారు పెరగడంతో మాకు కూడా చేతినిండా పని దొరుకుతోంది. - ఎంవీ సోమరాజు(పెదకాపు), ఎలక్ట్రీషియన్, రాయవరం సోలార్ ఇన్వర్టర్లకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి సోలార్ ఇన్వర్టర్ల ద్వారా విద్యుత్ శాఖపై భారం తగ్గుతుంది. ప్రభుత్వం ప్రజల అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సోలార్ ఇన్వర్టర్లు వేయించుకునేవారికి రాయితీ ఇవ్వాలి. - కొవ్వూరి శివరామకృష్ణారెడ్డి, రాయవరం