వేసవి పూర్తిగా రాకుండానే విద్యుత్ శాఖ కోతల సమయాన్ని పెంచింది. దీంతో ఇన్వర్టర్లకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల విద్యుత్ అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు.
విద్యుత్ కోతలతో ఇన్వర్టర్లకు పెరుగుతున్న డిమాండ్
అనూహ్యంగా పెరిగిన ధరలు
ఎలక్ట్రీషియన్లకు చేతినిండా పని
రాయవరం, న్యూస్‌లైన్ : వేసవి పూర్తిగా రాకుండానే విద్యుత్ శాఖ కోతల సమయాన్ని పెంచింది. దీంతో ఇన్వర్టర్లకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల విద్యుత్ అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో సుమారు ఆరు గంటలు, పట్టణాల్లో నాలు గు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. దీనికితోడు పలుచోట్ల స్థానిక మరమ్మతుల పేరుతో అనధికార కోతలు కూడా వీటికి తోడవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉండ డం, ఉక్కపోత పెరిగిపోవడంతో ప్రజలు ఇన్వర్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కంపెనీలను బట్టి ధరలు
కంపెనీలనుబట్టి ఇన్వర్టర్ల ధరలు ఉంటున్నాయి. ఒక ఫ్యాన్, లైటుకు 100 ఆంపియర్ బ్యాటరీ, 400 వాట్ల సామర్థ్యంతో కూడిన ఇన్వర్టర్లు రూ.11 వేలకు లభిస్తున్నాయి. చిన్నపాటి సామర్థ్యం గల ఇన్వర్టర్లు రూ.10 వేల నుంచి కూడా అందుబాటులో ఉంటు న్నాయి. సామర్థ్యాన్నిబట్టి వీటి ధర రూ.40 వేల వరకూ కూడా ఉంటోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే కంపెనీలు, సామర్థ్యాన్నిబట్టి బ్యాటరీల ధర లు రూ.100 నుంచి రూ.వెయ్యి వరకూ పెరిగాయి.
సోలార్ ఇన్వర్టర్లు
సోలార్ ఇన్వర్టర్లకు కూడా ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. విద్యుత్ సరఫరా అయ్యే సమయంలోనే సాధారణ ఇన్వర్టర్ బ్యాటరీ చార్‌జ అవుతుంది. ఆ సమయంలో ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. సోలార్ ఇన్వర్టర్లకైతే కేవలం సూర్యరశ్మి ద్వారానే బ్యాటరీ చార్జింగ్ జరుగుతుంది. దీనిని వినియోగించడం వల్ల ఇటు విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు విద్యుత్ ఆదా కూడా జరుగుతుంది. సోలార్ ఇన్వర్టర్ల ధర కంపెనీనిబట్టి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంది.
చేతినిండా పని..
ఒక ఇన్వర్టర్ వేయాలంటే ఎలక్ట్రీషియన్ ప్రత్యేకంగా ఆ ఇంటికి వైరింగ్ చేయాలి. ఇన్వర్టర్లు వేయించుకునేవారు పెరగడంతో మాకు కూడా చేతినిండా పని దొరుకుతోంది.
- ఎంవీ సోమరాజు(పెదకాపు),
ఎలక్ట్రీషియన్, రాయవరం
సోలార్ ఇన్వర్టర్లకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి
సోలార్ ఇన్వర్టర్ల ద్వారా విద్యుత్ శాఖపై భారం తగ్గుతుంది. ప్రభుత్వం ప్రజల అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సోలార్ ఇన్వర్టర్లు వేయించుకునేవారికి రాయితీ ఇవ్వాలి.
- కొవ్వూరి శివరామకృష్ణారెడ్డి, రాయవరం