కార్పొరేట్ కథానాయకులు
భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగానే ఉంటారు. తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దొరికిన అవకాశాలను అందింపుచ్చుకుని, అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వాళ్లలో భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు. బహుళజాతి కార్పొరేట్ దిగ్గజ సంస్థల పగ్గాలను చేపట్టి, విజయపథంలో వాటికి సారథ్యం వహిస్తున్న వాళ్లలో మన భారతీయులే ముందంజలో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, నోకియా, మొటొరోలా వంటి బడా బడా సంస్థలకు అధినేతలు మనోళ్లే... ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల గురించి ఈ వారం ప్రత్యేక కథనం...
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్
కంప్యూటర్లు ఉపయోగించే వారందరికీ చిరపరిచతమైన పేరు ‘మైక్రోసాఫ్ట్’. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థకు మన తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈవోగా పనిచేస్తున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి యుగంధర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. పాఠశాల విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కొనసాగించారు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఈ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేశాక, 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.
మైక్రోసాఫ్ట్‌లోని వివిధ విభాగాలను విజయవంతంగా నిర్వహించి, తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత సీఈవోగా పనిచేసిన స్టీవ్ బాల్మెర్ 2014లో వైదొలగిన తర్వాత, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పగ్గాలను చేపట్టారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’. పత్రిక 2019 సంవత్సరానికి గాను సత్య నాదెళ్లను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ ఏడాదికేడాది వృద్ధి రేటును పెంచుకుంటూ దూసుకుపోతోంది. సాంకేతిక పరిజ్ఞానమే ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని సత్య నాదెళ్ల బలంగా నమ్ముతారు. తన జీవితానుభవాలను పంచుకుంటూ ఆయన రాసిన ‘హిట్ రిఫ్రెష్’ యువతరం పాఠకులకు అమితంగా స్ఫూర్తినిస్తోంది.
సుందర్ పిచయ్ గూగుల్
ఇంటర్నెట్ యుగంలో గూగుల్ లేనిదే ఎవరికీ గడవదు. గూగుల్ సంస్థకు, గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ సంస్థకు సుందర్ పిచయ్ సీఈవోగా ఉన్నారు. తమిళనాడులోని మదురైలో పుట్టిన సుందర్ పిచయ్, స్కూలు చదువు మద్రాసులో కొనసాగింది. తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత అమెరికా చేరుకుని, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అమెరికాలోని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘మెక్ కిన్సీ అండ్ కంపెనీ’లో కెరీర్ ప్రారంభించారు. తర్వాత 2004లో గూగుల్‌లో చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో పదవికి సుందర్ పిచయ్ పేరు కూడా పరిగణనలోకి వచ్చినా, చివరకు ఆ పదవి సత్య నాదెళ్లకు దక్కింది. అయితే, గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీ పేజ్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతూ, తన వారసుడిగా సుందర్ పిచయ్ని 2015 ఆగస్టులో ప్రకటించారు. గూగుల్ హోల్డింగ్ కంపెనీ ‘ఆల్ఫాబెట్’ రూపకల్పన పూర్తయిన తర్వాత అదే ఏడాది అక్టోబరులో సుందర్ పిచయ్ ‘అల్ఫాబెట్’, ‘గూగుల్’లకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. చైనాలో 2017లో జరిగిన వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్‌లో సుందర్ పిచయ్ గూగుల్ సీఈవో హోదాలో పాల్గొని ప్రసంగించారు.
అరవింద్ కృష్ణ ఐబీఎం
కంప్యూటర్ల తయారీ రంగంలో అతి పురాతనమైన సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ (ఐబీఎం). దాదాపు శతాబ్ది చరిత్ర కలిగిన ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ ఎంపికయ్యారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 6న ఐబీఎం సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీతో ఐబీఎంకు భారీ ఒప్పందం కుదర్చడంలో అరవింద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ, ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్ చేశారు. అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. అరవింద్ కృష్ణ తండ్రి విజయ్ కృష్ణ భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా పనిచేశారు. ఐబీఎంలో 1990లో చేరిన అరవింద్ కృష్ణ, సుదీర్ఘకాలం అదే సంస్థలో కొనసాగుతూ, అనతి కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఐబీఎంకు గల సుదీర్ఘ చరిత్రలో ఒక భారతీయుడు సీఈవో పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఐబీఎం ప్రస్తుత సీఈవో జిన్నీ రోమెట్టీ నుంచి కొద్దిరోజుల్లోనే బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కృష్ణ, ఐబీఎంకు మరిన్ని విజయాలను చేకూర్చిపెడతారని ఆశించవచ్చు.
అజయ్‌పాల్ సింగ్ బంగా మాస్టర్‌కార్డ్
అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ ‘మాస్టర్‌కార్డ్’కు అజయ్‌పాల్ సింగ్ బంగా సీఈవోగా సేవలందిస్తున్నారు. మహారాష్ట్రలోని పుణే సమీపంలోని ఖడ్కే పట్టణంలో బంగా పుట్టారు. పంజాబ్‌లోని జలంధర్‌లో మూలాలు గల ఆయన తండ్రి హర్భజన్‌సింగ్ బంగా ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా పని చేశారు. తండ్రి ఆర్మీ ఉన్నతాధికారి కావడంతో అజయ్ బంగా చదువు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు జలంధర్, సిమ్లా, ఢిల్లీలలో స్కూలు చదువు కొనసాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్ చేశాక, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. నెస్లే కంపెనీలో 1981లో తొలి ఉద్యోగం చేశారు.
ఆ తర్వాత వివిధ సంస్థల్లో సేల్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత పెప్సీకోలో చేరి, భారత్‌లో పెప్సీకి చెందిన ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. న్యూయార్క్ హాల్ ఆఫ్ సైన్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్థిక సాంకేతిక రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రసంగాలు చేస్తూ ప్రముఖ స్థానానికి చేరుకున్నారు. అమెరికన్ టీవీ ప్రముఖుడు జిమ్ క్రామర్ నిర్వహించే ‘మ్యాడ్ మనీ’ షోలో కూడా పాల్గొన్నారు. మాస్టర్‌కార్డ్ సీఈవోగా 2010లో బాధ్యతలు చేపట్టి, ‘మాస్టర్‌కార్డ్’ను విజయాల బాటలో నడిపిస్తున్నారు.
రాజీవ్ సూరి నోకియా
సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో ఎక్కువ మంది చేతిలో కనిపించేవి ‘నోకియా’ ఫోన్లే! ఫిన్లాండ్కు చెందిన బహుళజాతి సంస్థ నోకియా కార్పొరేషన్‌కు సీఈవోగా రాజీవ్ సూరి సారథ్యం వహిస్తున్నారు. రాజీవ్ సూరి ఢిల్లీలో పుట్టారు. కువైట్‌లో ఆయన స్కూల్ చదువు కొనసాగింది. తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఈ పూర్తి చేశారు. కెరీర్ తొలినాళ్లలో భారత్‌లోను, నైజీరియాలోను కొన్ని బహుళజాతి సంస్థల్లో కొంతకాలం పనిచేశాక 1995లో నోకియాలో చేరారు. 2004 నాటికి నోకియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్ సీఈవో స్థాయికి ఎదిగారు. పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలలో నోకియా మార్కెట్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. సంస్థలోని సమస్యలను పరిష్కరించడంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2014లో నోకియా కార్పొరేషన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
శంతను నారాయణ్ అడోబ్
దేశ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే బడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన అడోబ్‌కు సీఈవోగా శంతను నారాయణ్ 2007 నుంచి కొనసాగుతున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శంతను నారాయణ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, కాలిఫోర్నియా వర్సిటీ నుంచి ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. కంప్యూటర్ల తయారీ సంస్థ ‘ఆపిల్’తో కెరీర్ ప్రారంభించిన శంతను నారాయణ్, కొందరు మిత్రులతో కలసి ‘పిక్ట్రా’ సంస్థను నెలకొల్పారు. డిజిటల్ ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసే వెసులుబాటును తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ‘పిక్ట్రా’ సంస్థకే దక్కుతుంది.
తర్వాత ఆయన 1998లో అడోబ్ సంస్థలో వైస్‌ప్రెసిడెంట్ హోదాలో చేరారు. బరాక్ ఒబామా హయాంలో 2011లో మేనేజ్మెంట్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు. ఫొటోషాప్, పీడీఎఫ్, ఆక్రోబాట్ వంటి అడోబ్ ఉత్పత్తుల విజయం వెనుక కీలక పాత్ర పోషించిన శంతను నారాయణ్, అనతి కాలంలోనే సీఈవో స్థానానికి చేరుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ 2018లో శంతను నారాయణ్‌ను ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించింది. ప్రస్తుతం ఆయన అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్
క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్స్కు జయశ్రీ ఉల్లాల్ సీఈవోగా సారథ్యం వహిస్తున్నారు. లండన్‌లో పుట్టిన జయశ్రీ ఉల్లాల్ పాఠశాల విద్య ఢిల్లీలో కొనసాగింది. తర్వాత శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ నుంచి బీఎస్, శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సెమీ కండక్టర్ వస్తువులను తయారు చేసే అమెరికన్ బహుళ జాతి సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ (ఏఎండీ) నుంచి తన కెరీర్ ప్రారంభించారు. కొంతకాలం ఫెయిర్ చైల్డ్ సెమీకండక్టర్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ యూబీ నెట్‌వర్క్స్‌లో చేరారు.
అంచెలంచెలుగా ఎదుగుతూ, 2008 నాటికి అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అరిస్టా నెట్వర్క్స్ వ్యవస్థాపకులైన ఆండీ బెక్టాల్షీమ్, డేవిడ్ షెరిటన్లు ఏరి కోరి మరీ జయశ్రీ ఉల్లాల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆమె సారథ్యంలో అరిస్టా నెట్వర్క్స్ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. నెట్ వర్కింగ్ సంస్థల్లో పనిచేసే ఐదుగురు ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా జయశ్రీ ఉల్లాల్‌ను ‘ఫోర్బ్స్’ పత్రిక 2014లో ఎంపిక చేసింది.
దినేష్ పాలీవాల్ హర్మాన్
ఆడియో, వినోద సమాచార సాధనాలను తయారు చేసే బహుళజాతి సంస్థ హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్‌కు దినేష్ పాలీవాల్ సీఈవోగా సేవలందిస్తున్నారు. ఆగ్రాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన దినేష్ పాలీవాల్ చిన్నప్పటి నుంచి చదువులో అసమాన ప్రతిభా పాటవాలు కనబరచేవారు. యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ (ప్రస్తుతం ఐఐటీ,రూర్కీ) నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌లో ఉన్నత చదువు కొనసాగించడానికి స్కాలర్షిప్ లభించడంతో అమెరికాలోని మయామీ యూనివర్సిటీలో చేరి, అక్కడ ఎంఎస్, ఎంబీఏ డిగ్రీలు పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్లలో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు.
అంచెలంచెలుగా ఎదిగి, 2003లో హర్మాన్ ఇంటర్నేషనల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పాలీవాల్కు మయామీ యూనివర్సిటీ గత ఏడాది గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ 2017లో హర్మాన్ సంస్థను స్వాధీనం చేసుకున్నా, దినేష్ పాలీవాల్ను ఈ పదవిలో కొనసాగనిచ్చింది. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే, కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న మైకేల్ మాసర్కు సలహాదారుగా డిసెంబరు వరకు కొనసాగనున్నారు.
జార్జ్ కురియన్ నెట్‌యాప్
థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్
జార్జ్ కురియన్, థామస్ కురియన్ సోదరులు కవలలు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగారు. ఇద్దరికీ ఐఐటీ మద్రాసులో సీటు దొరికినా, అక్కడ వారిద్దరూ చదువుకున్నది ఆరు నెలలు మాత్రమే. మరింత మెరుగైన చదువు కోసం, ఉన్నతమైన అవకాశాల కోసం ఈ కవల సోదరులిద్దరూ అమెరికా చేరుకుని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేరి, బీఎస్ పూర్తి చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో ఈ కవల సోదరులిద్దరూ ఒరాకిల్‌లో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జార్జ్ కురియన్ నెట్‌యాప్ సీఈవోగా 2015లో బాధ్యతలు చేపట్టగా, థామస్ కురియన్ 2019లో గూగుల్ క్లౌడ్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. భారత్‌కు చెందిన ఇద్దరు కవల సోదరులు ప్రతిష్ఠాత్మకమైన రెండు వేర్వేరు బహుళ జాతి సంస్థలకు సీఈవోలుగా ఎదగడం విశేషం.
సంజయ్ మెహ్రోత్రా మైక్రాన్ టెక్నాలజీ
కంప్యూటర్స్ మెమొరీ స్టోరేజ్ పరికరాల సంస్థ మైక్రాన్ టెక్నాలజీకి సంజయ్ మెహ్రోత్రా 2017 నుంచి సారథ్యం వహిస్తున్నారు. సంజయ్ మెహ్రోత్రా స్కూలు చదువు ఢిల్లీలో కొనసాగింది. తర్వాత బిట్స్ పిలానీలో చేరినా, కొద్ది కాలానికే అక్కడి నుంచి కాలిఫోర్నియా వర్సిటీకి బదిలీ అయి, అక్కడ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేశారు. కెరీర్ తొలినాళ్లలో 1988లోనే ఆయన తన మిత్రులతో కలసి కంప్యూటర్ మెమొరీ స్టోరేజ్ పరికరాల ఉత్పాదన సంస్థ శాన్డిస్క్ను నెలకొల్పారు. శాన్డిస్క్ సీఈవోగా 2011 నుంచి 2016 వరకు కొనసాగారు. కంప్యూటర్ స్టోరేజ్ పరికరాల రూపకల్పనలో విశేషమైన పరిశోధనలు సాగించిన మెహ్రోత్రా ఏకంగా 70 పేటెంట్లను సొంతం చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫౌండేషన్ మెహ్రోత్రాను 2013లో ‘సీఈవో ఆఫ్ ది ఇయర్’గా గుర్తించి, సత్కరించింది.
ఇదివరకటి సారథులు వీరే...
ప్రస్తుతం వివిధ బహుళ సంస్థల సీఈవోలుగా కొనసాగుతున్న భారతీయుల గురించి తెలుసుకున్నాం సరే, సమీప గతంలోనే కొందరు భారతీయులు కొన్ని బహుళజాతి సంస్థలకు సారథ్యం వహించి తమదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో పెప్సీకోకు సారథ్యం వహించిన ఇంద్రా నూయీ అగ్రస్థానంలో నిలుస్తారు. మద్రాసులో పుట్టి పెరిగిన నూయీ తన కెరీర్‌ను భారత్‌లోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ద్వారా ప్రారంభించారు. ఆమె పెప్సీకో సీఈవోగా 2006 నుంచి 2018 వరకు కొనసాగారు. ప్రస్తుతం ఆమె పెప్సీకో చైర్‌వుమన్‌గా కొనసాగుతున్నారు. ఇక సంజయ్‌కుమార్ ఝా ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ ‘మోటొరోలా’కు, ‘గ్లోబల్ ఫౌండ్రీస్’కు సీఈవోగా పనిచేశారు.
యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లలో ఇంజనీరింగ్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేసిన సంజయ్‌కుమార్ ఝాను అమెరికా ప్రభుత్వం 2018లో యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కీలక పదవిలో నియమించింది. ఇదిలా ఉంటే, ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఫ్రాన్సిస్కో డిసౌజా 2007 నుంచి 2019 వరకు సేవలందించారు. డిసౌజా తండ్రి ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన కెన్యాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో ఫ్రాన్సిస్కో డిసౌజా నైరోబీలో పుట్టారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆసియాలలో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత చదువులు చదువుకున్నారు.
– పన్యాల జగన్నాథదాసు