ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల వాతలు పెడుతున్న ప్రభుత్వం పరిశ్రమలనూ వదలడం లేదు. వారానికి సరిపడా విద్యుత్‌ను పరిశ్రమలకు సరఫరా చేయలేమంటూ ఏపీఎస్‌పీడీసీఎల్ చేతులెత్తేసింది. ఈమేరకు ఈనెల 3వ తేదీ నుంచి పరిశ్రమలకు వారానికి ఒకరోజు పూర్తిగా విద్యుత్ ఇవ్వకుండా నిలిపేయనున్నారు.
ప్రతి గురువారం పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఉండదు. దీంతో వారానికి ఒకరోజు పరిశ్రమలు మూతేసుకోవాల్సిన పరిస్థితి. ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు కూలీల ఉపాధి కూడా కష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ఇస్తామని చెబుతున్న అధికారులు 5 గంటలకు మించి ఇవ్వడం లేదు. పంటలు కాపాడుకునేందుకు అర్ధరాత్రుళ్లు పొలాల గట్ల వెంట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంలో మూడు గంటలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇక గ్రామాల పరిస్థితి వర్ణనాతీతం.
వ్యవసాయ విద్యుత్ ఇచ్చే సమయాల్లోనే గ్రామాల్లో పగటిపూట కరెంటు ఉంటోంది. పగటి పూట పట్టుమని రెండు, మూడు గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదు. రాత్రివేళల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వేసవికి ముందే ఇలా ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
పరిశ్రమలకు ‘పవర్’ పంచ్
Published Sun, Mar 2 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement