కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: కరవు మండలాల ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది. వర్షాభావం కారణంగా జిల్లాలోని అత్యధిక మండలాలలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం మాత్రం కేవలం 16 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. నిత్యం కరవుతో సతమతమయ్యే రాయచోటి నియోజక వర్గంలో కేవలం ఒక మండలాన్ని మాత్రమే కరవు ప్రాంతంగా ప్రకటించడం ఎంత వరకు సమంజసమని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జమ్మలమడుగు, బద్వేలు నియోజక వర్గాల్లో మెజారిటీ మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నా మొక్కుబడిగా ఒక్కో మండలాన్ని మాత్రమే తీసుకోవడం దారుణమని పేర్కొంటున్నారు. చాలీచాలని వర్షాలతో ఖరీప్ పంటలు దెబ్బతిన్నాయి. వేరుశనగ పంటను సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలి ఉన్న అరకొర పంటలు తెగుళ్లతో చేతి రాకుండా పోయాయి. అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి ఆదుకోవాల్సింది పోయి కేవలం 16 మండలాలనే ప్రకటించి తీవ్ర అన్యాయం చేసినట్లు రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సొంత జిల్లాలో అధికంగా ప్రకటించుకున్నారు....
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో 33 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించుకుని వైఎస్సార్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారు. రైతు ప్రభుత్వం అని పైకి చెప్పుకుంటూ మోసం చేస్తారా.. దీనిపై ఆందోళనలు చేస్తాం.
- సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా కన్వీనర్, వైఎస్సార్ సీపీ
అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి....
జూన్, జూలై నెలలో కురిసిన అరకొర వర్షాలకు పంటలను సాగు చేశారు. ఆ తర్వాత ఆశించినంత వర్షం కురవకపోడంతో పంటలు ఎండిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి.
- రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు,
ఏపీ రైతు సంఘం
జిల్లాకు తీరని అన్యాయం చేశారు.....
కరవు మండలాల ప్రకటనలో జిల్లాకు తీరని అన్యాయం చేశారు. పంటల కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు ఇప్పటికీ తీరలేదు. ప్రభుత్వం ఇంత వివక్ష చూపడం తగదు.
- నాగసుబ్బయ్య, రైతు,
కత్తలూరు, వేంపల్లె మండలం.
ముమ్మాటికీ అన్యాయమే
Published Sat, Jan 4 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement