ఇలాగే వదిలేస్తారా..! | Leave the same ..! | Sakshi
Sakshi News home page

ఇలాగే వదిలేస్తారా..!

Published Thu, Sep 25 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ఇలాగే వదిలేస్తారా..!

ఇలాగే వదిలేస్తారా..!

సాక్షి కడప/పులివెందుల/లింగాల :
 వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి..  దిగుబడి పక్కనపెడితే.. పశువుల మేతకు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తోంది..  రైతు పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతోంది... వెంటనే ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన లింగాలలో నాగేశ్వరరెడ్డి అనే రైతుకు  చెందిన వేరుశనగ పంట పొలాన్ని పరిశీలించారు.  దాదాపు 90రోజులైనా  ఎదుగూ.. బొదుగూ లేకుండాపోయిన పంటను చూసి వైఎస్ జగన్ ఒకింత ఆవేదనకు గురయ్యారు.  వేరుశనగ మొక్కలను పీకి పరిశీలిస్తే కనీసం ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడాన్ని చూసి చలించిపోయారు. కనీసం పెట్టుబడులు కూడా రావని .. బ్యాంకులకు వెళితే పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా.. ఇన్సూరెన్స్ వర్తించే పరిస్థితి లేదని రైతు నాగేశ్వరరెడ్డితోపాటు పలువురు రైతులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంటను తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుందామంటే అధికారులు అలా తొలగించవద్దని  ప్రకటనలు ఇచ్చారని.. దీంతో పంటలను తొలగించలేకపోతున్నామని..అయినా ఇంతవరకు ఏ అధికారి పంట పొలాలను చూడలేదని రైతులు వైఎస్ జగన్‌కు తెలిపారు. జిల్లాను కరువు కింద ప్రకటించి పంట నష్ట పరిహారమైనా అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను లింగాల జెడ్పీటీసీ అనసూయమ్మ, ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి తదితరులు కోరారు. అనంతరం  వర్షంలేక వాడిపోతున్న జొన్న పంటతోపాటు ప్రతాప్‌రెడ్డికి చెందిన చీనీ చెట్లను వైఎస్ జగన్  పరిశీలించారు.  వ్యవసాయ శాఖ ఏడీ జమ్మన్న వర్షపాతానికి సంబంధించిన వివరాలతోపాటు పంటల వివరాల నివేదికను వైఎస్ జగన్‌కు అందించారు.  2010 నుంచి ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న అరటి పంటకు నష్టపరిహారం  అందించలేదని  రైతులు   వైఎస్ జగన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
 లింగాల కుడి కాలువ  పరిశీలన
 లింగాల కుడి కాలువను ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు.  కుడికాలువ పూర్తయినా.. మధ్యలో అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్న పనులను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.  ఇన్నేళ్లవుతున్నా ఎందుకు  కాలువ పని పెండింగ్ పెడుతున్నారని మైటాస్ సంస్థ ప్రతినిధిని ప్రశ్నించారు. త్వరలో చిత్రావతి నుంచి నీటిని విడుదల చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లింగాల కుడి కాలువలో అడ్డంకులు తొలగించేలా చర్యలు చేపట్టాలని లింగాల ఈఈ రవీంద్రనాథ గుప్తాను ఆదేశించారు. త్వరితగతిన కుడి కాలువ గట్లపై రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
 పీబీసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయండి :
 పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు సంబంధించి కేటాయించిన నీటిలో మొదటి విడతగా నీటిని విడుదల చేస్తున్నారని.. ఎగువ ప్రాంతాలలో వర్షాలు పడుతూ పరిస్థితి ఆశాజనకంగా ఉండి రెండవ విడతలో పూర్తిస్థాయిలో కోటా నీరు సీబీఆర్‌కు తీసుకురాగానే  పీబీసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీబీసీ ఈఈ రాజశేఖర్‌ను ఆదేశించారు.  బుధవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌తో ఈఈ చర్చించారు. ప్రస్తుతం తుంపెర వద్ద ఎన్ని క్యూసెక్కుల నీరు రికార్డు అవుతోంది.. మిడ్‌పెన్నార్ వద్ద ఎన్ని క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.. సీబీఆర్‌లో ప్రస్తుతం నిల్వ ఎంత.. తాగునీటి పరిస్థితితోపాటు సాగునీటికి సంబంధించిన అనేక అంశాలపై వైఎస్ జగన్ ఈఈతో మాట్లాడారు.
 పులివెందుల ప్రాంత రైతులకు సంబంధించి సక్రమంగా పీబీసీ నీరు రాకపోవడంతో పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. సీబీఆర్‌లో నిల్వను బట్టి పీబీసీ ఆయకట్టుకు నీటిని  విడుదల చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈఈను ఆదేశించారు.
 దసరా వేడుకలకు ఆహ్వానించిన ఆర్యవైశ్యులు :
 పులివెందులలోని అమ్మవారిశాలలో ఈనెల 25నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని.. సమయం అనుకూలిస్తే వేడుకలలో పాల్గొనాలని ఆర్యవైశ్యులు  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. దసరా ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్‌కు తెలియజేశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రత్యేకంగా వైఎస్ జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన
 ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్,
 జిల్లా అధ్యక్షుడు :
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు కమలాపురం, బద్వేలు ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, జయరాములు, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, గండ్లూరు వీరప్రతాప్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు జిల్లా రాజకీయాలపై వారు మాట్లాడుకున్నారు.
 అందరితో ఆప్యాయ పలకరింపు :
 ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బుధవారం తెల్లవారు జామున వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో ముద్దనూరులో దిగి పులివెందులకు చేరుకున్నారు. ఉదయం 8గంటలనుంచే క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజలతో ముచ్చటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటలవరకు నిరంతరాయంగా తరలివచ్చిన  ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ కార్యకర్తలతో చర్చించారు. పలువురిని పేరు పేరునా పిలుస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 వ్యక్తిగత కార్యదర్శిని
 పరామర్శించిన వైఎస్ జగన్ :
 పులివెందులలోని బాకరాపురంలో నివాసముంటున్న వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్‌ను ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. ఈ మధ్యనే రవి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రవిని వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement