సాక్షి, కడప : రైతు నేస్తంగా చెప్పుకునే ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మాత్రం ఆచరణ సాధ్యం కాని నిబంధనలతో ఇబ్బందులు పెడుతునే ఉంది. ఒకసారి రైతు పేరుతో సూక్ష్మ సేద్య పరికరాలు మంజూరు చేస్తే మళ్లీ పదేళ్లపాటు ఇచ్చే వెసలుబాటు లేదు. ప్రస్తుతం అధికారులు సాగులోఉన్న పంటకే డ్రిప్ పరికరాలు ఇస్తున్నారు. మరుసటి ఏడాది అన్నదాత ఇతర పంటలు వేసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సిందే.
శాస్త్రవేత్తలు పంట మార్పిడి పద్ధతి సూచిస్తున్నా ఉద్యానశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పేరుకే సబ్సిడీ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ ఒంటెద్దు పోకడలతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు. దీనికితోడు కొత్త నిబంధనల పేరుతో ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోంది. ముఖ్యంగా కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కొత్త నిబంధనలు ఇవే!
జూన్ నాటికి సూక్ష్మ సేద్య పరికరాలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఆలస్యంగా మేలుకుని ఇటీవలే మంజూరు చేసింది. రైతన్నలకు అవసరమైన మేర ఇవ్వకుండా కోతలు విధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భూసార, నీటి పరీక్షా ఫలితాలను క్రోడీకరించాలని సూచించింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాతే రైతన్నలకు పరికరాలు ఇవ్వాలని నిర్దేశించారు. అయితే గతంలో సూక్ష్మ సేద్య పరికరాలు ఇచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసేవారు. దీనికి టీసీఎస్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కంపెనీకి ప్రభుత్వం బకాయిలు ఉండడంతో వారు ఆన్‌లైన్ గురించి పట్టించుకోవడం లేదు.
దీంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జూన్ నాటికే పరికరాలను మంజూరు చేయాల్సి ఉండగా, అన్నదాతలు ఇప్పటికే ఓ సీజన్‌ను కోల్పోయారు. దీనికితోడు ఒకసారి రైతుకు డ్రిప్ మంజూరు చేస్తే పదేళ్లపాటు పంటలు పండించుకునేందుకు వీలు కలిగేలా డ్రిప్ పరికరాలను అమర్చాల్సి ఉంది. ప్రస్తుతం రైతు అరటి పంటను సాగు చేస్తూ ఉంటే ఆ పంటకే డ్రిప్‌ను అమర్చితే మరుసటి ఏడాది పసుపు, కూరగాయలు లాంటి పంటలు వేసుకోవాలంటే ఆ డ్రిప్ సౌకర్యం సరిపోదు. దీంతో రైతు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే!
‘సీమ’ జిల్లాల్లో డ్రిప్ మంజూరు ఇలా..
వైఎస్సార్ జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్య పరికరాలు ఏర్పాటు చేసే వీలున్నప్పటికీ జిల్లాకు కేవలం 12,500 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ప్రభుత్వం డ్రిప్ పరికరాలను మంజూరు చేసింది. చిత్తూరుజిల్లాలో లక్ష ఎకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ అక్కడ 27,500 ఎకరాల్లో డ్రిప్ పరికరాలను మంజూరుచేయడం గమనార్హం. అనంతపురం జిల్లాకు 27,500, కర్నూలుకు 5,196 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే డ్రిప్ పరికరాలు మంజూరు చేసింది.
మంత్రికి, రాష్ట్ర ఉద్యాన ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడంతో పథకంలో కొత్త చిక్కులు ఏర్పడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో పథక లక్ష్యాలు మాత్రం నెరవేరడం లేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి హామీ పథకంలో పండ్ల మొక్కలు నాటినప్పటికీ ఇంకా డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అమర్చకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతి ఏటా ఫిబ్రవరి నాటికి పధకాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. దీంతో లక్ష్యం ఎలా సాధించాలని జిల్లాల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
డ్రిప్.. ట్రిప్
Published Sat, Nov 16 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement