ఎందుకీ నిర్లక్ష్యం? | neglectance | Sakshi
Sakshi News home page

ఎందుకీ నిర్లక్ష్యం?

Published Sun, Jul 5 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

ఎందుకీ నిర్లక్ష్యం?

ఎందుకీ నిర్లక్ష్యం?

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరి శనివారం మరోమారు ప్రస్ఫుటమైంది. కొన్ని నెలలుగా తరచూ వివాదాస్పదమవుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నుంచి ఆయన అర్ధంతరంగా అధికారులను వెంటబెట్టుకుని వెళ్లిపోయారు. జిల్లాలో ప్రజలు వివిధ సమస్యలతో తల్లడిల్లుతున్న సమయంలో అర్థవంతంగా నిర్వహించాల్సిన సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది.
 
 ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహ రించడమే ఇందుకు కారణమైంది. శనివారం నాటి జెడ్పీ సమావేశంలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడరాదని ప్రజాప్రతినిధులు కోరారు. జెడ్పీ చైర్మన్ అనుమతితో చర్చ లేవనెత్తారు. చర్చ నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. ప్రజాప్రతినిధులుగా వారి అభిప్రాయాలను గౌరవించాల్సిందిపోయి, చులకన భావంతో అడ్డగించడమే వివాదానికి మూలమైంది.     ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు భాగం. ఈ అంశం అధికారులకు తెలియని విషయం కాదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక్క పార్టీకే పరిమితం కాదు. రాష్ట్రంలో అందరికీ చెందిన వాడు. సీఎం అధికారికంగా ఆయనకు పర్యటిస్తే ప్రొటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం ఉండాలి. అది వారి హక్కు. తమ హక్కులకు భంగం కల్గించొద్దని పదేపదే ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. ఒక్కమారు పొరపాటు జరిగింటే మరోమారు ఆ పొరపాటుకు ఆస్కారం లేకుండా చూడడం దక్షత కల్గిన పాలకుల విజ్ఞతగా పరిశీలకులు భావిస్తున్నారు. అదే అంశం పదేపదే ఉత్పన్నమౌతుంటే ప్రజాప్రతినిధులుగా వారి హక్కులపై పోరాటం చేయడంలో ఏమాత్రం తప్పిదం కాదని పలువురు వివరిస్తున్నారు. గండికోట ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి వస్తే, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేదు. పెపైచ్చు వాస్తవ పరిస్థితులను వివరిస్తామని స్వయంగా
 
 ఎందుకీ నిర్లక్ష్యం?
 మొరపెట్టుకున్నారు. అవకాశం కల్పించాల్సిందిపోయి, 300 మంది పోలీసులతో ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో జిల్లా ప్రజా ప్రతినిధులను, అఖిలపక్షంను అడ్డుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా కమలాపురం పర్యటనకు సీఎం వస్తే.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఆహ్వానమే లేదు. ఖాజీపేటలో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆహ్వానం అందలేదు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులుగా లేవనెత్తితే అజెండాలోని అంశం కాదని దాటవేత ధోరణి వ్యక్తమైంది. ప్రజాప్రతినిధులకు వ్యక్తిత్వం ముఖ్యం కాదా.. అన్న ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన పాలకులు ఎదురుదాడి చేయడం ఏమేరకు సబబు అని వారు నిలదీస్తున్నారు.
 
 మీడియా పట్ల నిరంకుశమే..
  జిల్లా పరిషత్ సమావేశం నుంచి కలెక్టర్ అర్ధంతరంగా నిష్ర్కమించడంతో జిల్లా అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. ఎందుకు సమావేశం నుంచి వెళ్లిపోతున్నామనే విషయాన్ని అక్కడ అధికారులు ప్రకటించలేదు. సాయంత్రం ఐదున్నర్ర గంటలకు కలెక్టర్.. సభా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన చెప్పాల్పిందంతా చె ప్పాక, మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ఆయన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి బయలుదేరారు. మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో ఉండడమే అందుకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం తాను చెప్పిందే, సూచించిందే కరెక్టు అన్న ధోరణి వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కల్గుతోందని పలువురు వివరిస్తున్నారు. ఎవరిది నియంతృత్వమో తాము చ ర్చకు సిద్ధమని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి సవాల్ విసిరారంటే యంత్రాంగం డొల్లతనం తేటతెల్లం అవుతోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
 
 ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తా : జిల్లా కలెక్టర్
  తనను లక్ష్యంగా చేసుకుని  జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు దూషణలకు దిగడం దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ కె.వి. రమణ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఇటీవల నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో బద్వేలు ఎమ్మెల్యే జయరాములు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తాను పని చేస్తానన్నారు. లింగాల మండలం మురారి చింతల గ్రామంలో జన్మభూమి సందర్భంగా అధికారులను మూడు గంటల పాటు నిర్బంధించారని తెలిపారు.
 
 ఇలా వ్యవహరించి పనులు చేసుకోగలమని భావించడం సరికాదన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. రామారావు మాట్లాడుతూ కలెక్టర్‌ను టార్గెట్ చేసి ప్రజాప్రతినిధులు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనల గురించి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో రెండవ జాయింట్ కలెక్టర్ చంద్రశేఖరరెడ్డి, డీఆర్‌ఓ సులోచన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement