మూగ వేదన | medical services | Sakshi
Sakshi News home page

మూగ వేదన

Published Fri, Mar 6 2015 2:40 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

medical services

కడప అగ్రికల్చర్ : జిల్లా పశు సంవర్ధక శాఖను సిబ్బంది కొరత పీడిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. పశువుల యజమానులు, గొర్రెల పెంపకందార్లు నానా అవస్థలు పడుతున్నారు. సరైన వైద్యం అందక పశువులు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
 
 సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బందితోపాటు పాలనాపరమైన సిబ్బంది, పశువులకు వైద్యం చేసే సిబ్బంది ఉంటేనే పశువులకు వైద్య సేవలు అందించడానికి వీలవుతుంది. శాఖలో ఉన్న ఖాళీలు ఇప్పట్లో భర్తీ చేసే పరిస్థితులు కనిపించడం లేదని ఆ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. క్షేత్ర స్థాయి ఉద్యోగులను సకాలంలో నియమించకపోతే పశువైద్యానికి తిప్పలు తప్పవని కూడా అధికారులు చెబుతున్నారు.
 
 జిల్లాలో 156 పోస్టులు ఖాళీ
 పశు వైద్యంలో వెటర్నరీ అసిస్టెంట్లే కీలకం. అయితే ఈ పోస్టులు 50 శాతం ఖాళీగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో పరిపాలన పరంగా మూడు డిప్యూటీ డెరైక్టర్ పోస్టులకుగాను ఒకటి డిప్యూటేషన్‌లో పూర్తికాగా, రెండు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఐదు డివిజన్లు ఉన్నాయి. వీటిలో 102 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉండగా 110 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఒక పోస్టు ఖాళీగా ఉంది. 12 వెటర్నరీ ఆసిస్టెంట్లు ఉండగా, ఒకటి ఖాళీగా ఉంది. రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్(ఆర్‌ఎల్ యు) కడపతో సహా 51 మండలాల్లో 131 ఉన్నాయి. వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్లు 26 మంది ఉండాల్సి ఉండగా 10 ఖాళీలున్నాయి. జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు 51 మందికిగాను 10 ఖాళీలు ఉన్నాయి. లైవ్‌స్టాక్ అసిస్టెంట్స్(ఎల్‌ఎస్‌ఎ) 90కి గాను 40 ఖాళీలున్నాయి.
 
 జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 72కు గాను 51 ఖాళీలు దర్శనమిస్తున్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి జాయింట్ డెరైక్టర్ల సమీక్షలో క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పూసగుచ్చినట్లు వివరించామని, ప్రభుత్వానికి నివేదికలను పంపినా ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని ఆ శాఖ అధికారులు బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పశువులకు వైద్యం అందించడం గగనమవుతోందని వాపోతున్నారు. జిల్లాలో పశువులకు అరకొర వైద్య సేవలే అందుతున్నాయి.  
 
 గోపాలమిత్రలే దిక్కు
 ప్రాథమిక చికిత్స కోసం, కృత్రిమ గర్భోత్పత్తి చేయడానికి పశు వైద్యశాలలు లేని చోట ప్రభుత్వం గోపాలమిత్రలను ప్రవేశపెట్టింది. జిల్లాలో ఏడుగురు గోపాలమిత్రలు పని చేస్తున్నారు. వీరు గౌరవ వేతనంతో పని చేస్తారు. పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత వల్ల చాలా ప్రాంతాల్లో వీరికి ప్రాథమిక చికిత్స అందించేందుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. దీంతో కృత్రిమ గర్భోత్పత్తి లక్ష్యాలు పూర్తి చేయలేక అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు కరువు భత్యం, పే రివిజన్‌తో భారీగా వేతనం పెరిగిన నేపథ్యంలో వీరి గౌరవ వేతనం అంతంత మాత్రమే కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 డాక్టర్‌ను మేం ఎప్పుడూ చూడలేదు..
 మాది పెండ్లిమర్రి మండలం గంగనపల్లె. నాకు 100 గొర్రెలు ఉన్నాయి. అవే మాకు జీవనాధారం. గొర్రెలకు బాగలేకపోతే రెడ్డెయ్య అనే వ్యక్తి వచ్చి ఇంజక్షన్లు వేస్తారు. మందులు తాపుతాడు. అతను తప్ప మా గ్రామానికి వచ్చే వారేలేరు. మూడు గొర్రెలకు బాగ లేకపోతే మొన్ననే అమ్మేశాను. వైద్యం అందడం లేదు. గ్రామంలో పశువులకు, గొర్రెలకు రోగాలు వస్తే రెడ్డేయ్యే చూస్తాడు. పెండ్లిమర్రి డాక్టరు గాని వాళ్ల మనుషులు గాని గ్రామానికి వచ్చి పశువులను, గొర్రెలను చూసింటే ఒట్టు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. కడపలో ఉండే అధికారులు కూడా గ్రామానికి వచ్చిన రోజులు లేవు.     
 -నాగమల్లయ్య, గొర్రెలయజమాని, గంగనపల్లె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement