కొబ్బరినూనె.. సబ్బు బిళ్ల.. కొనేదెలా!
సాక్షి, కడప: పేద విద్యార్థుల సంక్షేమానికి నిధుల గండి పడింది. వెనుకబడిన వర్గాలకు చెందిన పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం శీతకన్ను వేసింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ అధికారంలో ఉన్న పెద్దలు పేర్కొంటున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. విద్యార్థులకు కొబ్బరి నూనె, సబ్బులు తదితర కాస్మోటిక్ వస్తువుల కొనుగోలుకు నెలనెల అందించాల్సిన నిధులకు రెండు నెలలుగా బ్రేక్ పడింది. అటు ట్రెజరీ అధికారుల అలసత్వమో, ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియదుగానీ హాస్టళ్ల విద్యార్థులు మాత్రం అవస్థలు ఎదుర్కొంటున్నారు.
రెండు నెలలుగా అందని కాస్మోటిక్స్
జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సుమారు 143 బాలుర, బాలికల హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో సుమారు 10 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కాస్మోటిక్స్ ఛార్జీలు ఇప్పటికీ అందలేదు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 62 చొప్పున, బాలికలకైతే రూ. 75 చొప్పున అందించాలి. ఎప్పుడూ లేని విధంగా దాదాపు రెండు నెలల కాలంగా విద్యార్థులకు కాస్మోటిక్స్ అందించకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక అవసరాల నిమిత్తం విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా విద్యార్థులకు అందడంలో జాప్యం జరుగుతోంది. ట్రెజరీలో బిల్లుల విషయంలో ఆలస్యం జరుగుతోందని పలువురు వార్డెన్లు ఆరోపణలు చేస్తున్నారు.
కళాశాలల్లో మరో సమస్య
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో చదువుతున్న
విద్యార్థులకు సంబంధించి కాస్మోటిక్ ఛార్జీలు మంజూరు కాక అవస్థలు పడుతుంటే కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్య మరోలా ఉంది. ఇప్పటికే కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో స్కాలర్‌షిప్పుల కోసం 17,525 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 11,467 మందికి మంజూరయ్యాయి. 4 వేల మంది విద్యార్థులకు సంబంధించి ఆధార్, రేషన్‌కార్డులు సమర్పించకపోవడంతో అలాగే మిగిలిపోయాయి. దీనికిగాను సుమారు రూ.2.44 కోట్లు ఫీజు రీఎంబర్స్‌మెంట్, మెస్ బిల్లు కింద రూ. 1.22 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే, చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం కొసమెరుపు.
కాస్మోటిక్స్ నిధుల పంపిణీకి
చర్యలు తీసుకుంటున్నాం!
జిల్లాలో జనవరి నెలకు సంబంధించి నిధులు మంజూరై పంపిణీ చేశాం. ఫిబ్రవరి నెలకు సంబంధించి మాత్రం విద్యార్థులకు కాస్మోటిక్స్ రావాల్సి ఉంది. మంజూరు కాగానే వార్డెన్ల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటాం. అలాగే కళాశాల విద్యార్థులకు సంబంధించి కూడా నిధులు భారీగా ఉన్నాయి. విద్యార్థులు పత్రాలు సమర్పిస్తే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
- ప్రసాద్, జేడీ,
సాంఘిక సంక్షేమశాఖ
పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలి
నా పేరు వంశీ. నాలాంటి పేద విద్యార్థులమే చదువుకునేందుకు హాస్టళ్లలో చేరుతాం. ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి అధికారుల ద్వారా పంపిణీకి చర్యలు చేపట్టాలి. త్వరగా నిధులు విడుదలైతే విద్యార్థులందరికీ కొంత ఆసరా.