నమ్మిన ప్రకృతి అక్కున చేర్చుకుంది...భవితకు ఢోకాలేదనుకున్నాడు ... లక్షల అప్పులు చేసి పంటకు మదుపుగా పెట్టాడు... ఆ నమ్మకాన్ని పుడమి తల్లి కూడా వమ్ము చేయలేదు. పండిన పంటతో కొండంత ఆత్మవిశ్వాసంతో మార్కెట్‌లోకి అడుగు పెట్టాడు. పాటదారుల మాయాజాలానికి చిక్కి విలవిల్లాడిపోయాడు. వ్యవసాయ జూదంలో ఓడిపోయాడు. సర్కారు ప్రేక్షకపాత్ర మరో పొగాకు రైతు ప్రాణం తీసింది. ఆ కుటుంబాన్నే కాదు ధర లేక అల్లాడుతున్న రైతుల గుండెల్లో పొగ పెట్టింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : పొగాకు పంట ప్రాణాలు తీస్తోంది. అప్పులు తీసుకువచ్చి పంటలు వేసిన రైతన్నకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆందోళనతో రైతులు కలత చెందుతున్నారు. వేలం కేంద్రాల్లోనే ఇప్పటికి ఇద్దరు రైతన్నలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. తాజాగా కొండపి నియోజకవర్గం చింతలపాలెం గ్రామానికి చెందిన కొండలరావు అనే కౌలురైతు టంగుటూరులోని వేలం కేంద్రంలోనే కుప్పకూలి ప్రాణాలు కొల్పోయాడు. ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పొగాకు పంట వేసిన దళిత రైతు బ్యాంకుతోపాటు బయట కూడా అప్పులు చేసి పొగాకుపై మదుపు పెట్టారు. బుధవారం పొగాకు వేలం కేంద్రానికి బేళ్లు తీసుకువెళ్లిన సమయంలో వేలంలో అతి తక్కువ ధర పలుకుతుండటంతో ఆందోళనకు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న రైతులు ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగానే మృత్యువాత పడ్డాడు.
వెనుక నుయ్యి...ముందు గొయ్యి
ఒకవైపు పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. మరోవైపు కొనుగోలు కూడా జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది క్రాప్‌హాలిడేకి వెళ్లాలా? లేక ప్రత్నామ్నాయం వైపు చూడాలా అన్న డోలాయమానంలో పొగాకు రైతులున్నారు. ప్రత్నామ్నాయ పంటలు వేయాలన్నా ఇక్కడ వాతావరణం, నీటి లభ్యతకు పనికి వచ్చే పంటలు పత్తి, శనగ, మిర్చి మాత్రమే. మిర్చికి మాత్రం ఈ ఏడాది కొద్దో,గొప్పో ధర పలకగా, శనగ, పత్తి రైతులు గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారు. అయితే పొగాకు బోర్డు ధోరణికి విసిగిపోయిన పత్తి రైతులు తమకు పొగాకు బోర్డు నష్టపరిహారం చెల్లిస్తే పంట వేయకుండా తప్పుకుంటామంటున్నారు. సిగిరెట్ ఆరోగ్యానికి హానికరమంటూ ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఆ డబ్బులు రైతాంగానికి ఇచ్చి ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లమంటే బావుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో బ్యారన్‌కు పది లక్షల మేర నష్టపరిహారమిస్తే రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్తారంటూ మాజీ పొగాకు బోర్డు సభ్యుడు మారెళ్ల బంగారుబాబు కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. పొగాకు బోర్డు స్పందించి కొనుగోళ్లు చేయకపోతే వచ్చే ఏడాది క్రాప్‌హాలిడేకి వెళ్లక తప్పదని మరికొందరు రైతు నాయకులు భావిస్తున్నారు. ఇటీవల రైతులతో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ నిర్వహంచిన సమావేశం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇందులో గ్రేడ్ల వారీగా నిర్వహించిన ధరలు కూడా రైతులకు గిట్టుబాటు కాదనే వాదన వినిపిస్తోంది.
మార్కెట్‌లో పోటీ లేని వేలం అవసరమా..
సిగిరెట్ తయారీ సంస్థలు తయారు చేసిన సిగిరెట్లను మన దేశంలోనే అమ్మి అధిక లాభాలు పొందుతున్నాయి. గతంలో కాఫీ బోర్డు సంక్షోభ సమయంలో రెండు ధరల పద్ధతిని అవలంబించింది. నేడు పొగాకు బోర్డు కూడా సిగిరెట్ తయారీ దారులకు ఒక ధర, మిగతా పోటీదారులకు మరో ధర నిర్ణయించి అమ్మకాలు జరిపితే మార్కెట్‌లో పోటీ పెరుగుతుంది. కొత్త వ్యాపారులు పొగాకు రంగంలోకి వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు అమలవుతున్న విధానం గుత్త సంస్థలకు అనుకూలంగా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
బోర్డు జోక్యం అవసరం...
మార్కెట్‌లోకి పొగాకు బోర్డు ట్రేడ్‌వింగ్ ద్వారా ప్రవేశించి కొంత పొగాకును కొనుగోలు చేస్తూ ఎగుమతిదారులను ప్రోత్సహిస్తే రైతు గట్టెక్కుతాడు. రక్షణ రంగంలో సైతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన కేంద్ర ప్రభుత్వం పొగాకు రంగంలోకి అనుమతించకపోవడం మోసపూరితమని సంబంధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపించి రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నారు. 2000 సంవత్సరంలో రూ. 50కి మించని ధర క్రాఫ్ హాలిడే తర్వాత కేజీ రూ. 135కి పెరిగిన సంగతి రైతులు గుర్తుచేస్తున్నారు.
రైతులు పొగాకును పండించడానికి నాలుగు నెలలు పడితే అమ్మడానికి ఆరు నెలలు పడుతోంది. రైతు నివాసాలను గోడౌన్లగా మార్చి గుత్త సంస్థలు తమకు కావల్సినపుడు బోర్డు ద్వారా తెప్పించుకుని తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ పద్దతి వల్ల రైతులు పండించిన పంట ఆరిపోవడంతో తూకాలలో తరుగుదల వస్తోంది. మరోవైపు రంగుమారిపోవడంతో గ్రేడ్ కూడా తగ్గిపోతోంది. ఇంకోవైపు పంట కోసం తెచ్చిన అప్పులపై వడ్డీల భారం పెరిగిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతును ఆదుకోని పక్షంలో వారి ఉద్యమం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఈ నెల పదో తేదీలోపు గిట్టుబాటు ధరలు రాకపోతే పొగాకు రైతుల తరపున ఉద్యమిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రకటించడంతో రైతుల్లో కొంత ఆశ కనపడుతోంది.
ఎవరిదీ పాపం
Published Thu, Jul 9 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement