మందులను ఎందుకు నిషేధిస్తారంటే...
విషయం
ఒక మందు మార్కెట్‌లోకి రావడానికి ముందు అనేక దశల్లో పరీక్షలు జరుగుతాయి. ముందుగా జంతువుల మీద ప్రయోగించి ఎటువంటి అనుబంధ సమస్యలూ లేవని నిర్ధారించుకున్న తరవాత ప్రయోగానికి సిద్ధమైన మనుషులకు కొంత టెస్ట్ డోస్ ఇచ్చి దాని ప్రభావాన్ని గమనిస్తారు. ఒక మందు ఇన్ని దశలను దాటి అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయినప్పటికీ కొన్ని మందులు దీర్ఘకాలంలో కొన్ని ఇబ్బందులను కలగచేస్తుంటాయి.
మరికొన్ని మందులను ఇతర మందులతో కలిపి వాడినప్పుడు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఫలానా అనారోగ్యానికి ఫలానా మందు వాడిన వారిలో మాత్రమే కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని నిర్ధారణగా తెలిస్తే ప్రభుత్వం ఆ మందులను నిషేధిస్తుంది.
భారత ప్రభుత్వం తాజాగా స్థూలకాయాన్ని తగ్గించే ఫెన్‌ఫ్లురామైన్, డెక్స్‌ఫెన్‌ఫ్లురామైన్ ఔషధాలను నిషేధించింది. వీటిని దీర్ఘకాలం వాడడం వలన కార్డియాక్ ఫైబ్రోసిస్ (గుండె కవాటాల మందం పెరగడం), శ్వాస వ్యవస్థ ఒత్తిడికి లోనవడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు, ఫలితంగా ఉన్నట్లుండి గుండె ఆగిపోయి హఠాన్మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అందుకే అవి నిషేధానికి గురయ్యాయి.