
సాక్షి, అమరావతి: బుధవారం నుంచి పదిరోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినాలుగా జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ఎస్‌బీఐ జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సంతకం చేయించారు. ప్రతి పోలీసు స్టేషనుకు వెళ్లి రేపటి నుంచి పాలసీలు అందించనున్నారు.
ఈరోజు లాంఛనంగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్ళు డి.రజని, దుర్గా ప్రసాద్‌లకు పాలసీలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ, పోలీసుల అద్భుత సేవలకు సెల్యూట్ చేశారు. వారికి 40లక్షల వరకూ యాక్సిడెంటల్ పాలసీ , 3లక్షల వరకు సహజమరణం పాలసీ అందించనున్నట్లు తెలిపారు. సంవత్సరానికి 12 రూపాయలు కడితే రెండు లక్షల బీమా లభిస్తుందని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజనను కూడా అందరూ వినియోగించుకోవాలి అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీ లో అమలు జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రికార్డు స్థాయిలో దేవాలయాలకు సంబంధించిన 306 కేసులను ఏపీ పోలీసు శాఖ చేధించిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు ,ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్ తో మ్యాపింగ్ చేశామని, అంతర్వేది రధం ఘటన అనంతరం దేవాలయాలకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయని ప్రకటించారు.
అందులో 27 కేసులు చేధించి తరచుగా నేరాలకు పాల్పడుతున్న 54 మంది పాత నేరస్ధులను గుర్తించామని పేర్కొన్నారు. 130 మందిని అరెస్టుచేసి , 1196 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. దిశా అప్లికేషన్‌ను 11 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. ఎస్ఓఎస్ యాప్ ద్వారా 79,648 వినతులు వచ్చాయని, వీటిలో 604 కాల్స్ పై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 122 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ లు 2019లో 62 నమోదు కాగా, 2020 ఇప్పటి వరకూ 279 నమోదు అయినట్లు వెల్లడించారు. రాష్ట్రం లో నేరాల సంఖ్య 18 శాతం తగ్గిందని గౌతం సవాంగ్ ప్రకటించారు.