బ్యాంకుల ‘కుమ్మక్కు’పై కాంపిటీషన్ కమిషన్ దృష్టి
న్యూఢిల్లీ: పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ నియంత్రణ ఎత్తివేసినప్పటికీ చాలా మటుకు బ్యాంకులు దాదాపు ఒకే రేటును పాటిస్తుండటంపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) దృష్టి సారించనుంది. ఈ విషయంలో అవి కుమ్మక్కయ్యాయా అన్న కోణాన్ని పరిశీలించనుంది. శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఈ విషయాలు తెలిపారు.
నియంత్రణ ఎత్తివేతతో వడ్డీ రేట్లను తమ ఇష్టానుసారం మార్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ), మరికొన్ని ఇతర బ్యాంకులు నాలుగు శాతం మాత్రమే ఇస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. అవి కుమ్మక్కయ్యే ఇలా చేస్తున్నాయా లేక ఇతరత్రా మరో కారణమేదైనా ఉందా అన్నది పరిశీలిస్తామన్నారు. మరోవైపు, ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలపై ఫిర్యాదుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమకు ఈ మధ్యనే సంబంధిత సమాచారం చేరిందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తదుపరి విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెలన్నర- రెండు నెలల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. సంప్రదాయ షాపులతో పోలిస్తే ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఇస్తుండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఏపీలో సిమెంటు సంస్థల కుమ్మక్కుపై ఫిర్యాదు కొట్టివేత..
ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు కంపెనీలు కుమ్మక్కై సిమెంటు రేట్లు పెంచేశాయన్న ఫిర్యాదును సీసీఐ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలను ధృవీకరించేలా తగిన ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది. మేలో ఎన్నికల తర్వాత నెల రోజుల వ్యవధిలో సిమెంట్ కంపెనీలన్నీ కూడబలుక్కుని బస్తాకు రూ. 75 మేర రేట్లను పెంచేశాయని ఫిర్యాదిదారు ఆరోపించారు.
మరోవైపు, సిమెంటు దిగ్గజాలు హోల్సిమ్-లఫార్జ్‌ల విలీన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా చెప్పారు. అటు ఫార్మా దిగ్గజాలు సన్-రాన్‌బ్యాక్సీ డీల్‌పై నెలాఖరులోగా నిర్ణయం తీసుకోగలమని వివరించారు. రాన్‌బాక్సీని దాదాపు 4 బిలియన్ డాలర్లతో సన్‌ఫార్మా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.