సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కల్తీ కల్లు ప్రాణాలు తీస్తోంది. పచ్చని జీవితాల్లో చిచ్చు పెడుతోంది. కల్తీ కల్లుతో మరణిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. మూడు రోజుల క్రితం బెల్లంపల్లి మున్సిపాల్టీలోని పెద్దనపల్లికి చెందిన బొడ్డుపల్లి వెంకటేశ్(35) కల్తీ కల్లుతో మరణిస్తే మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐ గురువయ్య స్పందించలేదు. కల్లు శాంపిళ్లు సేకరించి కల్తీ కల్లు మరణాన్ని ‘మమ’ అనిపించారు. 24 గంటలు గడవక ముందే బెల్లంపల్లి మండలం చాక్‌పల్లిలో పూలవేణి బక్కయ్య(45) గుడుంబా తాగి మృతి చెందాడు. గురువారం నిర్మల్ మండలం మంజులాపూర్‌లో కల్లు బట్టి వద్దే పడిగెల నవీన్(18) కల్తీ కల్లు తాగి మృత్యువాత పడ్డాడు. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు కల్తీకల్లుతో, ఒక్కరు గుడుంబా తాగి మరణిస్తే మరో నలుగురు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. కడ్తాల్‌లో అనుమతి లేకున్నా ఓ కల్లు డిపో నడుస్తున్నా అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆబ్కారీ శాఖ నిబంధనలు బుట్టదాఖలు
‘కల్తీ’కల్లు తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని నిబంధనలున్నా అవి బుట్టదాఖలవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో కల్తీ కల్లు తయారీ ‘మూడు సీసాలు.. ఆరు గ్లాసులు’గా వర్ధిల్లుతోంది. కల్తీ కల్లు తయారీని ఆపండి మహాప్రభో అంటూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు ఆబ్కారీ అధికారులను కదిలించడం లేదు. జిల్లాలో ఉన్న ఈత చెట్లకు, మార్కెట్లో లభ్యమవుతున్న కల్లుకు పొంతన లేదని, లక్షల లీటర్ల కల్తీ కల్లు తయారవుతుందనేది బహిరంగ రహస్యం. మంచిర్యాల ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 143 కల్లు గీత సహకార సంఘాలు, 109 కల్లు గీత కార్మికులు ఉండగా ఆరు కల్లు డిపోలు నిర్వహిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. బెల్లంపల్లిలో ఏళ్ల తరబడిగా కల్తీ కల్లు వ్యాపారానికి ఓ వ్యక్తి ‘సుదర్శన’ చక్రం తిప్పుతుండగా, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మంచిర్యాల ప్రాంతాల్లో లెక్కకు మించిన కల్లు దుకాణాలను ఆబ్కారీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
హానికర అవశేషాలతో కల్లు తయారీ
ఆబ్కారీ అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న కల్లీ కల్లు వ్యాపారానికి హానికర అవశేషాలు డైజో, క్లోరోఫామ్, క్లోరల్ హైడ్రెడ్, అల్ఫాజోలం ముడి పదార్థాలు ఉపయోగిస్తున్నారు. చాలా చోట్ల ఈ ముడి పదార్థాలతో కల్తీ కల్లు తయారీ అవుతోంది. కల్తీకల్లు తాగినవారు మరణించినా, అస్వస్థతకు గురైన నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించి ఏమి మత్తు పదార్థాలు కలుపలేదని చేతులు దులుపుకోవడం ‘ఎక్సైజ్’కు పరిపాటిగా మారింది.
అయితే సుమారు ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు ఖానాపూర్, నిర్మల్ మండలం వెంకటాపూర్‌లలో కల్లు బట్టీలపై నిర్వహించిన దాడుల్లో 710 కిలోల క్లోరల్ హైడ్రేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసులు కూడా నమోదు చేయగా చాలా సందర్భాల్లో కల్లు కల్తీ అయినట్లు అంగీకరించని ఆబ్కారీ అధికారులకు కల్లు బట్టీల వద్దే మత్తు పదార్థాలు లభించడం చెంపపెట్టులా మారింది. అయినా ఎక్సైజ్ శాఖలో మార్పు లేకపోగా హానికరమైన పదార్థాలనే ఉపయోగిస్తున్నారు. ఈ కల్తీ కల్లు తయారీదారులపై ఆబ్కారీ అధికారులు మౌనంగా ఉండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మత్తు చంపేస్తోంది!
Published Sat, Sep 7 2013 6:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement