ఒరిజినల్ చాయిస్ విస్కీ క్వాటర్ బాటిల్ ధర రూ.75. ఇదే మద్యం ఇప్పుడు జిల్లాలో రూ.50లకే దొరుకుతోంది. మీ వద్ద రూ.45లే ఉన్నాయా.. ఫర్వాలేదు బాటిల్ తీసుకోండనే బేరం ఇటీవల ముమ్మరమైంది. అలాగనిక్లియరెన్స్ సేల్ అనుకుంటే పొరపాటు. ఈ కల్తీ కర్ణాటకమద్యం మందుబాబులకు కిక్కెక్కిస్తోంది. గ్రామాలు మొదలు.. ఢాబాల వరకు ఈ మద్యం వ్యాపారం జోరందుకుంది. మొదట్లో కర్ణాటక రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న శివారు గ్రామాల్లో మొదలైన ఈ నిషా జిల్లా మొత్తానికి పాకింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పల్లెల నుంచి పట్టణం వరకూ విస్తరించిన కల్తీ మద్యం వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. తక్కువ ధరకే లభ్యమవుతున్న మద్యానికి మందుబాబులు బానిసలవుతున్నారు. మొదట్లో అసలును పోలిన బాటిళ్లలో మద్యం సరఫరా చేసిన వ్యాపారులు.. ఆ తర్వాత తెలివికి పదును పెట్టారు. మద్యం ప్రియులను ఆకట్టుకునేందుకు టెట్రా ప్యాకులతో కిక్కెక్కిస్తున్నారు.
జ్యూస్ తాగినట్టుండే.. ఈ ప్యాకింగ్ ఇప్పుడు సరికొత్త బ్రాండ్‌గా అవతరించింది. జిల్లాలోకి వస్తున్న నకిలీ మద్యమంతా గోవాలోని డిస్టిలరీలలో తయారవుతున్నదే. అక్కడి నుంచి బెంగళూరుకు.... అనంతరం బళ్లారి మీదుగా రాష్ర్టంలోకి తరలిస్తున్నారు. ఇందులోనూ ప్రధానంగా బళ్లారి నుంచి కర్నూలు జిల్లాకే అధికంగా కల్తీ మద్యం రవాణా అవుతోంది. ఈ మద్యాన్ని ఒరిజినల్ బాటిల్‌ను పోలిన ప్యాకింగ్‌తో మందుబాబులకు చేరుస్తున్నారు.
కర్ణాటక రాష్ర్టంలో తయారు చేసినట్టుగా నకిలీ లేబుళ్లు సృష్టిస్తున్నారు. ఒరిజినల్‌ను పోలిన బాటిళ్లలో మద్యం నింపేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే, కర్ణాటక మద్యం అని ముక్తాయిస్తున్నారు. అందుకే తక్కువ ధరకు అమ్ముతున్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ కల్తీ మద్యం ఎన్ని కుటుంబాల్లో అంధకారం నింపుతుందో.. ఎందరి ఆరోగ్యంతో చెలగాటమాడుతుందోననే ఆందోళన ఇటీవల కాలంలో అధికమవుతోంది.
కూల్‘డ్రింక్’ షాపులతో మొదలు...
కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రధానంగా చిన్న షాపులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. మొదట్లో కూల్ డ్రింక్ షాపులు... అనంతరం పాన్ షాపులు, కిరాణా షాపుల ద్వారా విస్తరించారు. ఇప్పుడు ఏకంగా ఢాబాలకూ ఈ కల్తీ వ్యాపారం వ్యాపించింది. వాస్తవానికి బెల్టు షాపులకు వైన్ షాపుల నుంచి సరుకు రావడం కొంచెం కష్టమయింది.
ప్రతి బాటిల్‌కు లెక్క చెప్పాల్సి రావడంతో వైన్‌షాపుదారులు కూడా ఇటీవల కాలంలో విచ్చలవిడిగా బెల్టు షాపులకు సరుకు ఇచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఈ లోటును ఇప్పుడు కర్ణాటక కల్తీ మద్యం వ్యాపారులు భర్తీ చేస్తున్నారు. ఒరిజినల్ ఛాయిసే... అయితే, కర్ణాటక మద్యం.... అందులోనూ ధర తక్కువంటూ మాయమాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మాములు మద్యంతో పోలిస్తే తక్కువ ధర కావడంతో ప్రధానంగా పేద ప్రజలు ఈ మద్యానికి బానిసవుతున్నారు.
విచారణకు సహకరించండి
జిల్లాతో పాటు రాష్ర్టమంతటా వ్యాపించిన ఈ నకిలీ మద్యానికి అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్‌శాఖ విఫలమయింది. కొత్త పంథాలో విస్తరించిన ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటే కర్నాటక ప్రభుత్వ సహకారం అవసరమని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధానంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తరించిన కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు విచారణకు సహకరించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని రాష్ర్ట ఎక్సైజ్‌శాఖ కోరినట్టు సమాచారం.
అందులో భాగంగానే ఉన్నతాధికారులు అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది. వాస్తవానికి జిలాలో పట్టుబడిన భారీ నకిలీ మద్యం కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బళ్లారి, బెంగళూరులకు కూడా జిల్లా ఎక్సైజ్ పోలీసులకు వెళ్లారు. అయితే, కేసు విచారణకు సంబంధించిన ప్రధానమైన ఆధారాలు ఏవీ లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వ సహకారం కోరినట్టు సమాచారం.
ధర తక్కువ..కిక్కెక్కువ!
Published Tue, Dec 30 2014 3:54 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement