
కన్నీళ్లు పెట్టిస్తున్న ‘కల్లు’
- మరో ముగ్గురు కల్లుకు బలి
- బావిలోకి దూకిన మరో వ్యక్తి..
- ఐదుకు చేరిన మృతుల సంఖ్య
భైంసా/బాసర : కల్లు కన్నీళ్లు పెట్టిస్తోంది. చదువుల తల్లి క్షేత్రం బాసరలో కల్లు మృతుల సంఖ్య పెరుగుతూపోతోంది. కల్తీ కల్లు మహమ్మారిలా ఒక్కొక్కరిని పొట్టనపెట్టుకుంటోంది. కల్లులో మత్తు తక్కువై ఇప్పటికే పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. ఆదివారం బాసర గ్రామానికి చెందిన గైని శంకర్, మోతుకురి స్వరూపం చారి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం బాసరలో మరో ఇద్దరు మృతిచెందగా, నిర్మల్‌లో మరొకరు మృతిచెందారు. దీంతో కల్లు బాధిత మృతుల సంఖ్య ఐదుకు చేరింది. స్థానికుడైన ముల్కిపోతన్న కల్లులేక ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలిపోయూడు. దీంతో చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన నిజామాబాద్‌కు తరలిస్తుండగా ముల్కిపోతన్న(57) కన్నుమూశాడు. మృతిచెందాడు. బాసరకే చెందిన దూజ్‌గాం పోశెట్టి(63) ఫిట్స్ వచ్చి ఇంట్లో సృ్పహతప్పి కిందపడిపోయారు. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయాడు.
మైలాపూర్‌లో..
బాసర అనుబంధ గ్రామమైన మైలాపూర్‌కు చెందిన కొందపురం పోశెట్టి కల్లులేక అస్వస్థతకులోనయ్యాడు. బాసర పీహెచ్‌సీకి తరలించి చికిత్సలు చేయించారు. ఇంటికి చేరుకున్నాక విచిత్రంగా ప్రవరిస్తూ పక్కనే ఉన్న బావిలోకి దూకాడు. అపస్మారక స్థితిలో ఉన్న కొందపురం పోశెట్టిని కుటుంబీకులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా బాసరలో కల్లుదుకాణం మూసి ఉంచారు. కల్లు దొరకక కొందరు, దొరికిన కల్లులో మత్తులేక మరికొందరు అస్వస్థతకు లోనవుతున్నారు. కల్లులేక బాసరలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల కుటుంబీకులను భైంసాకు చెందిన వ్యాపారవేత్త రామారావుపటేల్ పరామర్శించారు.
నిర్మల్‌లో ఒకరి మృతి..
నిర్మల్ అర్బన్ : కల్తీకల్లుకు నిర్మల్‌లో బుధవారం మరొకరు బలయ్యారు. స్థానిక ఈద్‌గాంకు చెందిన మహమూద్(45) మంగళవారం కల్లు తాగాడు. అందులో మత్తు మోతాదు తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు చికిత్సలు అందించినా బుధవారం పరిస్థితి విషమించడంతో మహమూద్ మృతిచెందారు. ఆయనకు భార్య అమీనాబేగం, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత రెండురోజుల్లో 40 మంది కల్లుబాధితులు నిర్మల్ ఆస్పత్రికి తరలివచ్చారు.