
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది.
అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది.
దద్దరిల్లిన అసెంబ్లీ
కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment