tamilnadu assebly
-
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
తమిళ అసెంబ్లీలో జయ చిత్రపటం
సాక్షిప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో దివంగత సీఎం జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం జయ చేసిన కృషిని స్పీకర్ కొనియాడారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై జయకు నివాళులర్పించారు. అసెంబ్లీ హాలులో ఇప్పటికే పెరియార్, అన్నాదురై సహా పదిమంది అగ్రనేతల చిత్రపటాలను గత ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. కాగా, చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని డీఎంకే, కాంగ్రెస్ బహిష్కరించాయి. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆస్తుల కేసులో జయ దోషిగా తేలినందున ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీ నుంచి తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ వేసింది. -
ప్రతిపక్ష నేతగా స్టాలిన్ ఎన్నిక
చెన్నై: తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా డీఎంకే నేత ఎంకే. స్టాలిన్ ఎన్నికయ్యారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల కార్యదర్శులు, సర్వ సభ్య సభ్యులతో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతి పక్ష నేతను, శాసన సభా పక్ష ఉప నేత, పార్టీ విప్‌లను ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 89 సీట్లు గెలుచుకుని డీఎంకే బలమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కాగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 2011లో అసెంబ్లీకి ఎన్నికైనా సమావేశ మందిరంలోకి మాత్రం ఇంతవరకూ అడుగు పెట్టలేదు. తాను కూర్చునేందుకు తగ్గ వసతి కల్పిస్తే, సభకు వస్తానని ఆయన వ్యాఖ్యలు చేసినా లేఖలు పంపినా పాలకులు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం డీఎంకే సభ్యులు సభలో పరిమితంగా ఉండడమే. అయితే, ఈసారి ఎక్కువ సంఖ్యలో సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న దృష్ట్యా, కేబినెట్ హోదా కల్గిన ప్రధాన ప్రతిపక్ష నేతకు సౌకర్యాల్ని కల్పించాల్సిన అవసరం తప్పనిసరి. తిరువారూరు నుంచి ఆరోసారి అసెంబ్లీకి ఎన్నికైనా కరుణానిధి మాత్రం బయటే ఉండి, పార్టీ పగ్గాలు తిప్పనున్నారు. దీంతో స్టాలిన్ కు ప్రతిపక్ష నేత హోదాను కట్టబెట్టారు.