చెన్నై: తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా డీఎంకే నేత ఎంకే. స్టాలిన్ ఎన్నికయ్యారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల కార్యదర్శులు, సర్వ సభ్య సభ్యులతో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతి పక్ష నేతను, శాసన సభా పక్ష ఉప నేత, పార్టీ విప్‌లను ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 89 సీట్లు గెలుచుకుని డీఎంకే బలమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
కాగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 2011లో అసెంబ్లీకి ఎన్నికైనా సమావేశ మందిరంలోకి మాత్రం ఇంతవరకూ అడుగు పెట్టలేదు. తాను కూర్చునేందుకు తగ్గ వసతి కల్పిస్తే, సభకు వస్తానని ఆయన వ్యాఖ్యలు చేసినా లేఖలు పంపినా పాలకులు మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం డీఎంకే సభ్యులు సభలో పరిమితంగా ఉండడమే.
అయితే, ఈసారి ఎక్కువ సంఖ్యలో సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న దృష్ట్యా, కేబినెట్ హోదా కల్గిన ప్రధాన ప్రతిపక్ష నేతకు సౌకర్యాల్ని కల్పించాల్సిన అవసరం తప్పనిసరి. తిరువారూరు నుంచి ఆరోసారి అసెంబ్లీకి ఎన్నికైనా కరుణానిధి మాత్రం బయటే ఉండి, పార్టీ పగ్గాలు తిప్పనున్నారు. దీంతో స్టాలిన్ కు ప్రతిపక్ష నేత హోదాను కట్టబెట్టారు.