జగ్గంపేట / గోకవరం :కష్టంతో పులిసే ఒళ్లు కాస్త తేలిక పడాలని తాగిన మత్తుపానీయమే వారి పాలిట మృత్యుఘాతమైంది. ఎప్పుడూ తాగే కల్లే వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. ఇద్దరిని బలి తీసుకుని, నలుగురిని ఆస్పత్రుల పాల్జేసింది. పేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గోకవరం మండలం రంపయర్రంపాలెంలో కల్తీ కల్లు సృష్టించిన దారుణానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దాకారపు శ్రీను (39), నాగులపల్లి దుర్గారావు (32) శుక్రవారం ఉదయం గ్రామంలోని కల్లు వ్యాపారి కాళ్ల చంద్రరావు వద్ద కల్లు తాగిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు.
అదే దుకాణంలో కల్లు తాగిన అదే గ్రామానికి చెందిన కోశెట్టి గంగరాజు, కాళ్ల వెంకటేశ్వరరావు, పెబ్బిలి శివ, సుంకర శ్రీను, గేదెల వీర్రాజు, రాజానగరం మండలం కానవరానికి చెందిన పితాని సత్తిబాబులకూ వాంతులయ్యూరుు. వీరంతా వ్యవసాయ కూలీలే. దాకారపు శ్రీను, దుర్గారావులను కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే దుర్గారావు మృతి చెందాడు. శ్రీను చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. దుర్గారావుకు మూడేళ్ల క్రితం వివాహం కాగా ప్రస్తుతం భార్య గర్భవతి. శ్రీనుకు భార్య, కుమార్తె ఉన్నారు. అస్వస్థతకు గురైనవారిలో గంగరాజు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో, పితాని సత్తిబాబు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శివ, సుంకర శ్రీనులను గోకవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు, వీర్రాజుల ఆరోగ్యం కుదుటపడింది.
అంత్యక్రియలకు తరలిస్తుంటే అడ్డుకున్న అధికారులు
కల్తీ కల్లుతో జరిగిన దారుణం విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా శనివారం ఉదయం పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు రంగంలోకి దిగారు. దుర్గారావు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకువెళుతుండగా అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజమండ్రి అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్ మృతదేహాలను పరిశీలించి, రంపయర్రంపాలెంలో విచారణ నిర్వహించారు. కల్లు అమ్మిన చంద్రరావును గోకవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎస్సై ఆర్.శివాజీ కేసు నమోదు చేసి, రాజమండ్రి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. చంద్రరావు దుకాణంలోని కల్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాంబాబు, రంపచోడవరం ఎక్సైజ్ సీఐ చిట్టిబాబు సంఘటనపై విచారణ నిర్వహించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శివాజీ తెలిపారు. కల్తీ కల్లు సంఘటన గోకవరం మండలంలో ఇదే ప్రథమం. కాగా గుమ్మళ్లదొడ్డిలో నాలుగేళ్ల క్రితం కల్తీ సారా తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు.
కలిపింది క్లోరల్ హైడ్రేడా? మరొకటా?
కల్తీ కల్లు సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తాటి గెలలు వాడిపోతూ కల్లు దిగుబడి తగ్గడంతో, దానిలో నిషా తగ్గకుండా ఎక్కువ కల్లుగా మార్చేందుకు క్లోరల్ హైడ్రేడ్ కలిపారన్న అనుమానం వ్యక్తమవుతోంది. క్లోరల్ హైడ్రేడ్‌ను కలపడం వల్ల లీటరు కల్లునే నాలుగులీటర్లుగా తయారు చేయవచ్చని అంటున్నారు. కల్లులో తాగిన వారికి చేటు కలిగించే ఏ పదార్థం కలిసిందన్నది ల్యాబ్ పరీక్షల్లో తేలాల్సి ఉంది. కాగా కల్లు వ్యాపారి చంద్రరావుకు వేరొకరితో కల్లు తీసుకునే తోట లీజు సొమ్ము విషయమై వివాదం నేపథ్యంలో అతడి దుకాణంలోని కల్లును కావాలనే విషపూరితం చేశారా అన్న అనుమానమూ వ్యక్తమవుతోంది.
క్లోరల్ హైడ్రేడ్ విషంతో సమానం..
కల్లులో కల్తీకి వినియోగించే క్లోరల్ హైడ్రేడ్ విషంతో సమానమని జగ్గంపేట ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ జి.ఎస్.చార్లెస్ చెప్పారు. అది చిన్నమెదడు పనిచేయకుండా మొద్దుబారుస్తుందని, గ్యాస్ట్రైటిస్ (కడుపులో పుండ్లు) వచ్చి విపరీతంగా వాంతులు అవుతాయని చెప్పారు. కొన్ని సార్లు ప్రాణాలు పోతాయన్నారు.
కష్టజీవుల్ని కాటేసిన..కల్తీ కోర
Published Sun, Jun 7 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement