కల్తీమయం!    | Adulteration Alcohol In Mahabubnagar | Sakshi
Sakshi News home page

కల్తీమయం!   

Published Fri, Aug 31 2018 1:56 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Adulteration Alcohol  In Mahabubnagar - Sakshi

అచ్చంపేటలో పట్టుబడ్డ కల్తీ మద్యం (ఫైల్‌)   

అచ్చంపేట రూరల్‌ : కొన్ని సంవత్సరాలుగా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. వివిధ శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తూ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగించారు. గత పదేళ్లుగా మద్యం వ్యాపారంలో బాగా రాటుదేలిన నాయకులే దీనికి సూత్రధారులుగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో అమ్రాబాద్‌ మండలంలో జోరుగా కల్తీ మద్యం వ్యాపారం కొనసాగగా.. ఆ ప్రాంతంలో వైన్సులను లాటరీ పద్ధతిన దక్కించుకున్న వారు విచ్చలవిడిగా మద్యం కల్తీ చేసి అమ్మకాలు సాగించారు.

రెండుసార్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నారని మరోసారి కేసు చేశారు. అయితే అప్పట్లో లైసెన్స్‌ ఉండటంతో మద్యాన్ని కల్తీ చేసి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. అలవాటు పడిన వారు వైన్సులు.. లైసెన్సు లేకున్నా అదే తరహాలో మద్యం కల్తీ చేసి వైన్స్‌లకు చేరవేస్తున్నారు.

కూతవేటు దూరంలోనే.. 

గతంలో అమ్రాబాద్‌ ప్రాంతంలో మద్యం కల్తీ చేసిన వారు, లైసెన్స్‌లు దక్కని వారు ప్రస్తుత సంవత్సరం నుంచి అచ్చంపేట పట్టణాన్ని ఎంచుకుని మద్యం కల్తీ చేసి అమ్రాబాద్, పదరతోపాటు వివిధ వైన్సులకు చేరవేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ఇంటిలో గుట్టుగా మద్యం కల్తీ వ్యాపారం సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో ఎక్సైజ్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే మద్యం కల్తీ దందా జరగడం గమనార్హం. అయినా ఇన్ని రోజులు స్థానిక ఎక్సైజ్‌ అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మామూళ్ల విషయంలో తేడా వచ్చినందుకే ఇప్పుడు దాడులు జరిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఓసీ, ఎంసీలతో.. బ్రాండెడ్‌ 

అమ్రాబాద్‌ మండలానికి చెందిన వెంకట్రామ్‌నాయక్‌ గతంలో ఇదే మండలంలో వైన్సు షాపును దక్కించుకున్నారు. అప్పట్లో నకిలీ మద్యం తయారు చేసి వైన్‌షాపులో అమ్మినట్లు రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది మద్యం షాపు దక్కించుకోని వెంకట్రామ్‌నాయక్‌ అచ్చంపేట, వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు చెందిన ఓసీ, ఎంసీ లాంటి కొన్ని మద్యం బాటిళ్లను షాంపిల్‌గా తీసుకుని, అధిక రేట్లు ఉన్న బ్లెండర్‌స్పైడ్, సిగ్నేచర్, రాయల్‌ ఛాలెంజ్, రాయల్‌స్టాగ్‌ లాంటి ఖాళీ బాటిళ్లలో సగం మద్యం, సగం నీటిని నింపి బాటిళ్లపై మూతలను ఏర్పాటు చేసి వైన్‌ షాపులకు తరలిస్తున్నాడు.

గత కొన్నేళ్లుగా ఇదే తంతు చేస్తున్నాడని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రాత్రి వెంకట్రామ్‌నాయక్‌ ఇంట్లో తనిఖీ చేయగా కల్తీ మద్యం తయారు చేసిన 5 కాటన్ల ఓసీ బాటిళ్లు, 15 లీటర్ల కల్తీ మద్యం బాటిళ్లు, ఖాళీ సీసాలు, వాటిపై బిగించే మూతలను గుర్తించారు. 

బెల్టుషాపులకు సరఫరా.. 

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు వెలిశాయి. మద్యం ఏరులై పారుతుంది. సాధారణ మద్యం నుంచి విలువైన మద్యం వరకు లభ్యమవుతుంది. ప్రతి ఫుల్‌ బాటిల్‌పై రూ.50 నుంచి రూ.150 వరకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని గ్రామాల్లోని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఎక్సైజ్‌ అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి బెల్ట్‌షాపులపై దాడులు చేయడం లేదని, కేసుల కోసం మాత్రమే అప్పుడప్పుడు దాడులు చేసి ఉనికి చాటుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నల్లమల ప్రాంతంలో కల్తీ మద్యం వ్యాపారం జరగకుండా, గ్రామాల్లో బెల్ట్‌షాపు లేకుండా, మద్యం అధిక రేట్లకు విక్రయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement