జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్) : కల్తీకల్లు బాధితుల పిచ్చిచేష్టలు మరింత ముదిరిపోతున్నాయి. ఒక్కసారిగా కల్లు దొరకకపోవడంతో మతిస్థితిమితం కోల్పోయి రోడ్లపైకి వచ్చి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో ఆరుగురు మృతిచెందారు. జడ్చర్ల హౌజింగ్‌బోర్డు కాలనీలో సర్దార్(65) తన బావమరిది ఇంటివద్ద ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయి గురువారం జడ్చర్ల స్టేషన్ వద్ద రైల్వేగేటు సమీపంలో శవమై కనిపించాడు. జడ్చర్ల గ్రామపంచాయతీ ఇందిరానగర్‌కు చెందిన గొల్ల అంజమ్మ(65) మూడురోజులుగా అనారోగ్యానికి గురై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఇక మాగనూర్ మండలం తంగిడి గ్రామానికి చెందిన కాశిమప్ప (62) కల్తీకల్లు లేకపోవడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మిద్దె చెన్నయ్య(60) కల్తీకల్లు దొరకక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం పొలంలో శవమై కనిపించాడు. కొడంగల్ పట్టణానికి చెందిన యాలాల చెన్నప్ప(65) కల్లులో మత్తు లేకపోవడతో మతిస్థిమితం కోల్పోయి చనిపోయాడు. కొత్తూరు మండలంలోని నర్సప్పగూడ గ్రామానికి చెందిన నీరటి మణెమ్మ(65) రెండుమూడు రోజులుగా కల్లులో మత్తు తగ్గిన కారణంగా పిచ్చి చేష్టలు చేస్తోంది. గురువారం ఉదయం కుటుంబసభ్యులు బయటకు వెళ్లగానే ఇంట్లోనే చీరతో ఫ్యానుకు ఊరేసుకుని మృతి చెందింది.
ఆరుగురు కల్తీకల్లు బాధితులు మృతి
Published Thu, Sep 24 2015 8:25 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement