
కల్తీ కల్లు మరణాలకు.. సర్కారుదే బాధ్యత
- కాంగ్రెస్ బృందం ఆరోపణ
- ఉస్మానియాలో బాధితులకు పరామర్శ
సాక్షి, సిటీబ్యూరో : ‘రాష్ట్రంలో కల్తీ కల్లు పాలై అమాయకులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నా, ఆ మరణాల నివారణ కోసం ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టటం లేదు. ఈ వ్యవహరంపై తక్షణం స్పందించి అన్ని ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వైద్య నిపుణులతో రెస్క్యూ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లేనట్లయితే ఉన్నత స్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. శనివారం పార్టీ ప్రతినిధులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్‌ల బృందం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్తీ కల్లు బారిన పడి వందల సంఖ్యలో జనం మరణిస్తున్నా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని, కల్లు మాఫియా వెనక టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల హస్తం ఉందని వారు ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో విక్రయిస్తున్న కల్లులో చాలా చోట్ల డైజోఫాం,అల్ఫాజోంతో పాటు అధిక మత్తు కోసం ఎపిడ్రిన్ అనే విష రసాయనాలు కూడా వాడుతున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే కల్తీకల్లు మరణాలపై సిట్టింగ్‌జడ్జి చేత విచారణకు ఆదేశించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు.