సాక్షి, హైదరాబాద్: నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్స రంలో రూ.25 వేల కోట్లు ప్రతిపాదించా లని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పట్లో తక్కువ విస్తీర్ణంలో ఆ ఇళ్లను నిర్మించగా, ఇప్పుడు రెండు పడగ్గదులతో నిర్మించాలని నిర్ణయించింది.
ఇందుకోసం యూనిట్ కాస్ట్ ను రూ.5 లక్షలుగా ఖరారు చేస్తూ ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన విష యం తెలిసిందే. మొత్తంగా ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల ఇళ్లను నిర్మించాలని అనుకుంటోంది. దీంతోపాటు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయా లని నిర్ణయించింది.
వీటన్నింటికి కలిపి తొలి ఏడాదిలో రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని తాజాగా అంచనాకొచ్చింది. అధికారులతో ఉప ము ఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించి ప్రాథ మికంగా నిర్ణయించారు. దావోస్ పర్యటన కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రాగానే ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లకే రూ.20 వేల కోట్లు..
తొలి ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకొచ్చారు. నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపడితే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున ఇంత బడ్జెట్ అవసరమవుతుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం హడ్కో తదితర సంస్థల నుంచి తీసుకున్న అప్పు రూ.10 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో తొలి సంవత్సరం రూ.వేయి కోట్ల నుంచి రూ.2 వేల కోట్లను కేటాయించాలని లెక్కలు వేశారు.
అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 2వేల కోట్లు
గత ప్రభుత్వంలో మొదలై పూర్తి కాకుండా మిగిలిపోయి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లను కేటాయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా, త్వరలో కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న నేపథ్యంలో అందులో గృహనిర్మాణ పద్దు కింద ఎంత కేటాయిస్తుంది, ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి.. అన్న అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న భావనను కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment