హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఏంటి ? న్యాయ విచారణల వెనక ఆంతర్యం ఏంటి ? గత ప్రభుత్వ తప్పిదాలపైనే రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమా ? అసలు కాగ్రెస్ ప్రభుత్వం అడుగులు ఏ దిశగా పడుతున్నాయి?..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళ పాటు సాగిన గులాబీ పార్టీ పాలనలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం తాము చేసిన ఆరోపణల్ని రుజువు చేయడమే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని తాము ఇంతకాలం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ధరణి వెబ్‌సైట్ ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు చేతులు మారాయని ప్రభుత్వం భావిస్తోంది. ధరణిలో జరిగిన అక్రమాలు, లోటుపాట్లను తేల్చేందుకు కోదండ రెడ్డి అధ్యకతన ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి భారీ అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెరలేపిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జ్యూడిషియల్ ఎంక్వరీకి ప్రభుత్వం సిద్దమయింది. ఇందుకోసం రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆఫీస్ లలో ఏకకాలంలో విజిలెన్స్ ఎంక్వరీ మొదలు పెట్టింది.
విద్యుత్ కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి ఆధారాలు సేకరించే ప్రక్రియ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి మయంగా మారిందని, కమిషన్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంకోవైపు ప్రభుత్వ శాఖలలో బీఆర్ఎస్ నేతల సన్నిహితులు, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. అలాంటి వారు వెంటనే రిజైన్ చేసి వెల్లిపోవాలని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఎంక్వరీ చేయాలని సీఎం కోరాతామని కూడా ఇప్పటికే మంత్రి ప్రకటించారు.
ఓఆర్ఆర్ టెండర్లలోను భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ టెండర్లపై విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇవేకాదు.. ఫార్ములా ఈ రేసింగ్ లో హెచ్ఎండిఏ నుంచి రూ.55 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు జరిగాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరితహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట. దీనిపై కూడా చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భావిస్తున్న అన్ని శాఖలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు శాఖలపై విచారణకు ఆదేశించగా, మరికొన్ని శాఖలపై ఎంక్వరీకి సిద్ధం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఖండించారు. తాము ఆరోపించినట్లు అవినీతి జరిగింది నిజమే అని రుజువు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయింది.
ఇదీ చదవండి: నల్గొండపై బీజేపీ పట్టు?
Comments
Please login to add a commentAdd a comment