పెరుగుతున్న కల్లు బాధితులు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రుల్లో చేరిన 490 మంది బాధితులు
సాక్షి నెట్‌వర్క్, మహబూబ్‌నగర్ : కల్తీకల్లుకు బానిసలుగా మారి వింతగా ప్రవర్తిస్తున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో 490 మంది ఈ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ఇద్దరు బాధితులు మరణించగా, అనేక గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నారాయణపేట మండలంలో 11 మంది, గద్వాల మండలంలో శనివారం 18 మంది బాధితులు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20 మంది ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
2 రోజుల్లో నియోజకవర్గంలో 48 మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో చేరారు. కొడంగల్‌లో 20 మంది, చిట్లపల్లిలో 5, బొంరాస్‌పేట మండలం ఎనికెపల్లిలో 10, రేగడిమైలారంలో 15, బొంరాస్‌పేటలో 8, మద్దూరు మండలం దోరేపల్లిలో 28, దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో 8, దామరగిద్దలో 25, దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో 5, గోకాపస్లావాద్‌లో 10, కోస్గిలో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. బాలానగర్ మండలంలో రెండు రోజుల్లో 170 మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. జడ్చర్ల మండలంలో 19 మంది ఆస్పత్రిలో చేరారు. అలంపూర్ నియోజకవర్గంలో 23 మంది కల్తీకల్లు బాధితులున్నట్టు తేలింది. అలంపూర్‌లో 11 మంది, ఇటిక్యాలలో 12 మంది చికిత్స పొందుతున్నారు.
ఇప్పటికే ఇద్దరు మృతి
నారాయణపేట మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన బాలమ్మ (70), మక్తల్ మండలం ఊట్కూర్‌కు చెందిన కూలి జంగిడి క్రిష్ణయ్య(55) నారాయణ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా కరీంనగర్‌లో 18 మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో చేరారు.