మామూళ్ల మత్తు
సాక్షి, కర్నూలు/ డోన్ టౌన్ :
ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) నెల జీతం సుమారు రూ. 50 వేలు. అయితే ఆయన గీతం మాత్రం నెలకు రూ. 6 లక్షలపైమాటే. సీఐ జీతం రూ. 25 వేలు పైమాటే. కానీ ఆయనకు మామూళ్ల రూపంలో నెలకు అందుతున్నది మాత్రం అక్షరాల రూ. లక్ష. ‘మీరు ఎంత ధరకైనా అమ్ముకోండి. మద్యం కల్తీ చేసుకున్నా ఫర్వాలేదు. కానీ తమకిచ్చే మామూళ్లు ఇస్తే చాలు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆబ్కారీ అధికారులు.. మామూళ్లకు తెరతీసి సిండికేటు వ్యాపారులతో చేతులు కలిపారు.
వాస్తవానికి సిండికేట్లను అరికట్టాలన్న ఉద్దేశంతో సర్కారు మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఇలా షాపులు దక్కించుకున్న దుకాణాదారులందరినీ కలిపి ఆబ్కారీ అధికారులే సిండికేటుగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే షాపులు పొందిన తర్వాత(పోస్ట్ సిండికేట్) సిండికేటన్నమాట. గరిష్ట చిల్లర ధరల(ఎంఆర్‌పీ)కి మించి మద్యం విక్రయాలను జరుపుకోమంటూ.. మామూళ్లకు తెరలేపారు.
గతంలో వ్యాపారులే సిండికేట్ అయి గరిష్ట అమ్మకం ధరకు ఎంతో కొంత అదనంగా నిర్ణయించి అమ్ముకునే ఆనవాయితీ ఉండేది. ప్రస్తుతం ఈ బాధ్యతను ఎక్సైజ్ అధికారులు భుజాన వేసుకున్నారు. కొంత మంది ఎక్సైజ్ అధికారులు దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులను ఓ వేదిక మీదకు తీసుకువచ్చి సిండికేట్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మద్యం క్వార్టర్ బాటిల్‌కు రూ. 10, బీరు బాటిల్‌కు రూ. 15 వంతున అదనంగా వసూలు చేసుకోవచ్చంటూ మద్యం వ్యాపారులకు అధికారులు సెలవివ్వడంతో జిల్లాలో మద్యం సిండికేట్లు మళ్లీ చెలరేగిపోతున్నాయి.
గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయిస్తూ మందు బాబుల జేబులు గుల్ల చేస్తున్నారు. మద్యం మాఫియాకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్లులు అన్న చందంగా మద్యం వ్యాపారం యథేచ్చగా సాగుతోంది. ఇదే అదనుగా చూసుకొని పల్లెల్లో కూడా బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. అక్రమాన్ని నిరోధించాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ. 30 వేలు!
జిల్లాలో 14 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. నంద్యాల, కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలో ఈ స్టేషన్లు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 194 మద్యం దుకాణాలున్నాయి. ప్రతి నెలా వీటి ద్వారా రూ. 80 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గరిష్ట చిల్లర ధరకు అమ్మితే దుకాణాదారుకి రూ. 22 శాతం లాభం వస్తుందని అంచనా.
అది సరిపోవడం లేదని వ్యాపారులంతా సిండికేటై ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చిన్న సీసాపై రూ. 10, బీరు సీసాపై రూ. 15 పెంచి అమ్ముతున్నారు. ఈ సిండికేట్ల ఎక్సైజ్ అధికారులు అండదండలు అందిస్తుండటంతో ఒక్కో దుకాణాదారుడు ఎక్సైజ్ స్టేషన్ అధికారికి నెల వారీగా రూ. 30 వేలు మామూళ్ల రూపంలో అందజేస్తున్నట్లు సమాచారం. ఇలా ఆ సర్కిల్ పరిధిలో ఉండే స్టేషన్ల నుంచి ప్రతి నెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారు.
ఇందులో ఆయా అధికారులకు వాటాలు వెళ్తున్నాయి. ఉదాహరణకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు 14 స్టేషన్ల నుంచి నెలకు సరాసరి రూ. 50 వేల చొప్పున రూ. 7 లక్షల వరకు అందుతోందని సమాచారం. అసిస్టెంట్ కమిషనర్‌కు రూ. 2.50 లక్షలు, ఒక్కో ఎక్సైజ్ సూపరింటెండ్‌కు వారి పరిధిలోని స్టేషన్ల వారీగా నెలకు మొత్తం రూ. 6 లక్షలకుపైగా వాటాలందుతున్నట్లు తెలుస్తోంది. ఇక సీఐలకు ఒక్కొక్కరికి రూ. లక్ష, ఎస్‌ఐలకు రూ. 40 వేలు, కానిస్టేబుళ్లకు రూ. 15 వేలకు పైగా నెల వారీ మామూళ్లు అందజేస్తున్నట్లు సమాచారం. ఈ సొమ్మును వసూలు చేయడానికి ఒక్కో స్టేషన్‌లో ఇద్దరేసి కానిస్టేబుళ్లను నియమించడం విశేషం.
అందరూ కలిసిక(ట్టే)ట్టుగా..
జిల్లాలో మద్యం వ్యాపారులను ఒక వేదికపైకి తీసుకొచ్చిన ఎక్సైజ్ అధికారులు వారికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు కూడా చెబుతుండటం గమనార్హం. ఉదాహరణకు ఇటీవల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం ఒక స్టేషన్ పరిధిలోని నాలుగు షాపులపై దాడులు చేసి.. అక్రమాలపై రూ. 4 లక్షలు ఫెనాల్టీ రాస్తే... ఆ వెంటనే మిగిలిన షాపులకు చెందిన యజమానులు తలా రూ. 40 వేలు వేసుకుని అ సొమ్మును కట్టేశారు.
అంటే అందరూ కలిసికట్టు (సిండికేట్)గా కేసులనూ ఎదుర్కొంటున్నారన్నమాట. అదేవిధంగా ఎక్సైజ్ సిబ్బంది నుంచి అందుతున్న సహకారానికి ఈ సిండికేట్లు మరింత రెచ్చిపోయి.. కర్ణాటకకు చెందిన ఛీప్ లిక్కర్(స్ఫూరియస్ లిక్కర్)ను యథేచ్చగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బెల్టు షాపులూ కొనసాగుతున్నాయి. మ్తొతంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఈ తంతు యథేచ్చగా జరుగుతోంది.